ప్రీతి ఘటనపై అట్రాసిటీ కేసు.. కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి హరీష్
బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి వరంగల్ పోలీసులు సీనియర్ విద్యార్థి సైఫ్ పై కేసులు నమోదు చేశారు. ర్యాగింగ్ కేసుతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు.
వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన బాధాకరం అని అన్నారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతోందని చెప్పారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారాయన. నిమ్స్ ఆస్పత్రిలో ఆమెకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి. ప్రీతి తల్లిదండ్రులతో మంత్రి హరీష్ రావు ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
సంచలనంగా ఆత్మహత్యాయత్నం..
కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బుధవారం ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ప్రీతి కుప్పకూలి పడిపోయింది. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, వైద్యం అందించారు. మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వెంటిలేటర్ పై ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్ ర్యాగింగ్ ని తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆరోపిస్తున్నారు.
బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి వరంగల్ పోలీసులు సీనియర్ విద్యార్థి సైఫ్ పై కేసులు నమోదు చేశారు. ర్యాగింగ్ కేసుతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ప్రీతి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు వరంగల్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ బోనాల కిషన్. తదుపరి విచారణ అనంతరం సైఫ్ పై శాఖ పరమైన చర్యలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే నని దోషులు ఎప్పటికైనా తప్పించు కోలేరని స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం సరైనది కాదని, అందరూ సంయవనం పాటించాలని ఆయన కోరారు.