ప్రీతి ఆడియో టేపులో కీలక అంశాలు
సైఫ్‌కు వ్యతిరేకంగా వెళ్తే సీనియర్లంతా ఒక్కటై తనను మరింత దూరం పెడుతారని చెప్పింది. భయపడవద్దు.. ఏం కాదు.. సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తామని ఆమె తల్లి ఓదార్చింది.
మెడికో ప్రీతి ఆత్మహత్యకు ముందు రోజు తన తల్లితో మాట్లాడిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేపు బయటకు వచ్చింది. అందులో ప్రీతి తన బాధను తల్లితో చెప్పుకుంది. సీనియర్ సైఫ్ తనను వేధిస్తున్నారని.. ఏం చేస్తాడో అని భయంగా ఉందని తల్లితో చెప్పుకుంది. ప్రీతి తల్లి ఏమీ కాదు ధైర్యంగా ఉండూ అని సముదాయించింది.
సీనియర్లు అంతా ఒక్కటయ్యారని ప్రీతి ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు జూనియర్లు కూడా తనను వేధిస్తున్నారని వివరించింది. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్‌ఓడీ తాను చూసుకుంటా అన్నారని ఫోన్‌లో వివరించింది.
సైఫ్‌కు వ్యతిరేకంగా వెళ్తే సీనియర్లంతా ఒక్కటై తనను మరింత దూరం పెడుతారని చెప్పింది. భయపడవద్దు.. ఏం కాదు.. సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తామని ఆమె తల్లి ఓదార్చింది. వేధింపులపై ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయించవచ్చని తల్లి చెప్పగా.. తనకు కేవలం వేధింపులు లేకుండా చేస్తే చాలు అని ప్రీతి కోరింది. వాడు నిన్ను ఏమీ చేయలేడు.. ధైర్యంగా ఉండూ అని తల్లి పదేపదే సముదాయించారు.
సైఫ్ చాలా మందిని వేధిస్తాడని ఫిర్యాదు చేసేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ప్రీతి వివరించింది. నాన్న ప్రిన్సిపల్‌కు ఎవరితోనో ఫోన్ చేయించారని.. దాంతో హెచ్‌వోడీ పిలిచి ఎందుకు ప్రిన్సిపల్‌కు నేరుగా చెప్పారని ప్రశ్నించారని ప్రీతి వెల్లడించింది. సైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వు ఒకసారి నేను మాట్లాడుతా అని తల్లి కోరగా... వద్దు అని ప్రీతి సర్దిచెప్పింది. చాలామందిని వేధిస్తున్నా ఎవరూ బయటపడటం లేదన్నారు. సైఫ్‌ను సస్పెండ్ చేయాలని తాను కోరుకోవడం లేదని.. కేవలం తనను వేధించకుండా చూస్తే చాలని తల్లితో చెప్పుకుంది. ఈ ఆడియో బయటకు రావడంతో సైఫ్ వేధింపులపై పోలీసులకు మరింత స్పష్టత వచ్చింది.