Telugu Global
Telangana

మహేశ్వరానికి మెడికల్ కాలేజీ.. కందుకూరు వరకు మెట్రో కారిడార్ : సీఎం కేసీఆర్

తెలంగాణ ఇప్పుడు పచ్చబడింది. ఎనిమిదేళ్లుగా ఎంతో కృషి చేస్తే.. ఈ రోజు రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని కేసీఆర్ చెప్పారు.

మహేశ్వరానికి మెడికల్ కాలేజీ.. కందుకూరు వరకు మెట్రో కారిడార్ : సీఎం కేసీఆర్
X

తెలంగాణలో జిల్లాకొక మెడికల్ కాలేజీ పెడుతున్నాము. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి కోరారు. మన మంత్రి, మా ఇంటి ఆడపడచు అడిగితే కాదనలేము. రంగారెడ్డి జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేస్తున్నాను అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడ కాలేజీ పెట్టుకుంటారో వారు నిర్ణయించుకోవాలని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మహేశష్వరం మండలం తుమ్మలూరు అర్భన్ ఫారెస్ట్ పార్కులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అక్కడ మొక్కలు నాటిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణ ఇప్పుడు పచ్చబడింది. ఎనిమిదేళ్లుగా ఎంతో కృషి చేస్తే.. ఈ రోజు రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని కేసీఆర్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఒక వ్యక్తి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాడు. అక్కడ కాసేపు ఆక్సిజన్ పీల్చుకోమని చెప్పేవాడు. కానీ చెట్లు భారీగా పెంచితే ఆక్సిజన్ అదే పెరుగుతుంది. భూతాపం కూడా తగ్గుతుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో హరితహారం గురించి మొదట్లో నేను చెబితే చాలా మంది నవ్వారు. రాజకీయ నాయకులే కాకుండా, అధికారులు కూడా నేను చెప్పిన విషయాన్ని తేలికగా తీసుకున్నారు. కానీ ఈ రోజు హరితహారం కారణంగా రాష్ట్రం ఎలా పచ్చగా మారిందో ఒక సారి గమనించాలని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో ఇంత పచ్చదనం పెరగడానికి గ్రామ సర్పంచ్‌లు చేసిన కృషే కారణం. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో పెరిగిన పచ్చదనాన్ని చూసి దారులన్నీ పూలదారులుగా మారాయని ఇటీవలే ఒక కవి రాసిన పాటను కూడా గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో నేలలన్నీ బీడువారి భయంకరమైన పరిస్థితి ఉండేది. నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. అందుకే చెట్లను పెంచాలనే నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. అడవులను పెంపొందించేందుకు హరిత సైనికుల్లాగ ప్రియాంక వర్గిస్, భూపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం ఉన్న చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డోబ్రియల్ కూడా ఎంతో సహకరించారని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అర్భన్ పార్కులు కూడా రూపుదిద్దుకున్నాయి.. రాబోయే రోజుల్లో ప్రజలకు ఉచితంగా పండ్ల మొక్కలు అందించాలని నిర్ణయించాము. ఇందుకు అవసరమైన రూ.100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు నీటి సమస్య ఉన్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే పుష్కలంగా నీళ్లు వస్తాయని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరంతో పాటే పాలమూరు-రంగారెడ్డి కూడా పూర్తయ్యింది. కానీ కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కృష్ణా నది నీళ్లతో పంచాయితీ ఉన్నది. అందుకే గోదావరి నీళ్లను హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు లింక్ చేసి.. అక్కడి నుంచి ఈ రెండు నియోజకవర్గాలకు నీళ్లు అందేలా చేస్తానని కేసీఆర్ చెప్పారు. కచ్చితంగా ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చి తీరుతాయని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

కందుకూరుకు మెట్రో కారిడార్..

గత పాలకులు మెట్రోను సరిగా డిజైన్ చేయలేదు. ఏ దేశంలో, రాష్ట్రంలో అయినా ఎయిర్ పోర్టుకు మెట్రోను కలుపుతారు. కానీ మన దగ్గర అది జరగలేదు. అందుకే శంషాబాద్ వరకు తెలంగాణ ప్రభుత్వం మెట్రోను నిర్మిస్తున్నది. అక్కడి నుంచి మహేశ్వరం, కందుకూరు ప్రాంతాలకు మెట్రోను పొడిగిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్-బీహెచ్ఈఎల్ రూట్లో కూడా మెట్రో కారిడార్ వస్తుందన్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో ఉన్నది. తర్వాతి దశలో బీహెచ్ఈఎల్ నుంచి లకడీకపూల్ వరకు మెట్రో నిర్మిస్తామని చెప్పారు.

ఇక తుమ్ములూరులో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.1 కోటి మంజూరు చేస్తామన్నారు. మిగిలిన గ్రామపంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తూ త్వరలోనే జీవో విడుదల అవుతుందన్నారు. దీంతో పాటు మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, కార్పొరేషన్లకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

అటవీ శాఖకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు..

ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక అటవీశాఖ అధికారిపై కొంత మంది దాడి చేసి దారుణంగా చంపారు. అందుకే అటవీ శాఖ అధికారులకు సంబంధించిన రక్షణ బాధ్యత కూడా మరింతగా తీసుకుంటామని చెప్పారు. అటవీ శాఖ పరిధిలో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, వారికి సాయుధ బలగాల సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన ఫైలును సిద్ధం చేసి వెంటనే తన వద్దకు పంపాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు.

First Published:  19 Jun 2023 2:07 PM IST
Next Story