జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా.. కొత్తగా 8 కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
రాష్ట్రంలో వైద్య విద్యను దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎప్పుడో నిర్ణయించారు.
ఆరోగ్య తెలంగాణ సాధించే దిశగా సీఎం కేసీఆర్ వైద్య రంగంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తూ, ఇప్పటికే ఉన్న ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేస్తూనే.. ఆరోగ్య పరంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో వైద్య విద్యను దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎప్పుడో నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కొనసాగింపుగా కొత్తగా మరో 8 కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల, నారాయణ్‌పేట్, మెదక్, ములుగు, వరంగల్ జిల్లాల్లో కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఇటీవల రంగారెడ్డి జిల్లాలో హరితోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వేదిక మీదే రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ క్రమంలో మహేశ్వరంలో మెడికల్ కాలేజీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు తీసుకునేలా నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వైద్య కళాశాల, ఆసుపత్రిని నిర్మించే బాధ్యతను టీఎస్ఎంఎస్ఐడీసీకి అప్పగించింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా 100 ఎంబీబీఎస్ సీట్లతో కూడిన వైద్య కళాశాలకు అనుమతులు ఇచ్చారు. దీనికి అనుబంధంగా కొత్తగా ఆసుపత్రిని కూడా నిర్మించనున్నారు. మెదక్ జిల్లాలో కూడా 100 సీట్లతో కూడిన వైద్య కళాశాలకు అనుమతులు లభించాయి. ఇప్పటికే అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని.. వైద్య కళాశాలకు అనుబంధంగా మార్చడానికి అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనను టీఎస్ఎంఎస్ఐడీసీకి అప్పగించింది. అంతే కాకుండా.. ఇప్పటి వరకు వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న మెదక్ ఆసుపత్రిని ఇకపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు బదిలీ చేసింది.
వరంగల్ జిల్లా నర్సంపేటలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలో 100 సీట్లు లభించనున్నాయి. మెడికల్ కాలేజీ కోసం కొత్తగా బిల్డింగ్స్ నిర్మించనున్నారు. కాగా, ఇప్పటికే నర్సంపేటలో ఉన్న జనరల్ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు బదిలీ చేయనున్నారు.
ములుగు జిల్లాలో 100 ఎంబీబీఎస్ సీట్లతో కొత్త కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని.. కాలేజీకి అనుబంధంగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఆ ఆసుపత్రిని కూడా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకొని రానున్నారు. నారాయణ్‌పేట్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. దానికి అనుబంధంగా అక్కడే ఉన్న ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాకు కూడా కొత్తగా మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ఇక్కడ 100 ఎంబీబీఎస్ సీట్లతో కొత్తగా వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే గద్వాలలో ఉన్న ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు బదిలీ చేయనున్నారు.
కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల బాధ్యతను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించారు. అయితే, వైద్య కళాశాలలు.. ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్ బాధ్యతలను టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇచ్చారు. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మెడికల్ కాలేజీలకు, అనుబంధ ఆసుపత్రులు అప్‌గ్రేడ్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినందుకు గాను.. సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
— Harish Rao Thanneeru (@BRSHarish) July 5, 2023