Telugu Global
Telangana

మెదక్ పార్లమెంట్ పరిధిలో నేను మాత్రమే ఓడిపోయా..

రోజుకు ఎన్ని గంటలో తెలియని వ్యక్తిని ఎమ్మెల్యేగా మెదక్ ప్రజలు గెలిపించారన్నారు. పరోక్షంగా మైనంపల్లి రోహిత్ పై సెటైర్లు పేల్చారు.

మెదక్ పార్లమెంట్ పరిధిలో నేను మాత్రమే ఓడిపోయా..
X

ఈరోజు తెలంగాణ భవన్ లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్.. నేతలకు దిశా నిర్దేశం చేశారు. లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, అలవి కాని హామీలిచ్చిన కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచాలని సూచించారు. ఈ సమావేశానికి పార్లమెంట్ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు.. మెదక్ నుంచి ఓటమిపాలైన పద్మాదేవేందర్ రెడ్డి కూడా వచ్చారు. తన ఓటమిపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రచారంలో వెనుకబడి ఉన్నానని కేసీఆర్, హరీష్ రావు ముందుగానే హెచ్చరించారని గుర్తు చేశారు. ఓడిపోయినందుకు కొంత బాధగా ఉందన్నారు. అయితే తన ఓటమికంటే.. కేసీఆర్ సీఎం కాలేకపోయారన్న బాధే తనకు ఎక్కువగా ఉందని చెప్పారు పద్మా దేవేందర్ రెడ్డి.

దుష్ప్రచారం వల్లే..

మెదక్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో ఆరింటిలో బీఆర్ఎస్ దే విజయం. మెదక్ లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. తనపై కొందరు దుష్ప్రచారం చేయడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని అన్నారు పద్మా దేవేందర్ రెడ్డి. తన గెలుపు కోసం హరీష్ రావు కృషి చేసిన ఫలితం దక్కలేదన్నారామె. లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ సీటు ఎవరికి ఇచ్చినా గెలిపించుకుని తీరతామని చెప్పారు. మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు.

ప్రజలు బాధపడుతున్నారు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం హాట్ సీట్ గా మారిన సంగతి తెలిసిందే. అక్కడ మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్ కాంగ్రెస్ టికెట్ పై పోటీచేశారు. బీఆర్ఎస్ రెండు టికెట్లు ఇవ్వకపోవడం వల్లే మైనంపల్లి పార్టీ మారారు. ఆయన మల్కాజ్ గిరినుంచి, ఆయన కొడుకు రోహిత్ మెదక్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. తండ్రి మల్కాజ్ గిరిలో ఓడిపోగా.. కొడుకు రోహిత్ మాత్రం మెదక్ నుంచి విజయం సాధించారు. అయితే మెదక్ లో తాను గెలువలేదని ప్రజలు భాద పడుతున్నారని అంటున్నారు పద్మా దేవేందర్ రెడ్డి. రోజుకు ఎన్ని గంటలో తెలియని వ్యక్తిని ఎమ్మెల్యేగా మెదక్ ప్రజలు గెలిపించారన్నారు. పరోక్షంగా మైనంపల్లి రోహిత్ పై ఆమె సెటైర్లు పేల్చారు.

First Published:  19 Jan 2024 10:06 PM IST
Next Story