మాయావతి ట్వీట్.. BRSతో పొత్తుపై RSP క్లారిటీ
ఎన్డీఏ, ఇండియా కూటమితో పాటు ఏ ఇతర జాతీయ పార్టీలతో తాము పొత్తు పెట్టుకోమని గతంలోనే మాయావతి చాలా స్పష్టంగా చెప్పారన్నారు ప్రవీణ్ కుమార్.
పొత్తులపై బీఎస్పీ చీఫ్ మాయావతి చేసిన ట్వీట్‌పై క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. మాయావతి ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. మాయావతి ట్వీట్‌పై క్లారిటీ ఇస్తూ సోషల్‌మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
ఎన్డీఏ, ఇండియా కూటమితో పాటు ఏ ఇతర జాతీయ పార్టీలతో తాము పొత్తు పెట్టుకోమని గతంలోనే మాయావతి చాలా స్పష్టంగా చెప్పారన్నారు ప్రవీణ్ కుమార్. తృతీయ ఫ్రంట్ వార్తలను కూడా గతంలోనే మాయావతి కొట్టిపారేశారని గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని మాయావతి చెప్పారని.. అంతేకానీ కూటమిలో లేని పార్టీలతో కలిసి పనిచేయడం గురించి ఆమె తన ట్వీట్‌లో ప్రస్తావించలేదన్నారు RSP. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు.
గతంలో మధ్యప్రదేశ్, పంజాబ్‌లో జాతీయ కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిగినట్లుగానే.. ఇటీవల బీఆర్ఎస్‌తో జరిగిన చర్చలకు బీఎస్పీ హైకమాండ్ అనుమతి ఉందన్నారు. సీట్ల పంపకాలపై స్పష్టత వచ్చేంత వరకు చర్చలు కొనసాగుతూనే ఉంటాయన్నారు RSP.