Telugu Global
Telangana

గాలికి వచ్చి వెళ్లేవాడిని కాదు.. పార్టీ మార్పుపై మర్రి రియాక్ష‌న్

కోమటిరెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరిన వివేక్, మర్రి శశిధర్ రెడ్డి కూడా త్వరలో సొంత గూటికి చేరుకుంటారని ప్రచారం ప్రారంభమైంది.

గాలికి వచ్చి వెళ్లేవాడిని కాదు.. పార్టీ మార్పుపై మర్రి రియాక్ష‌న్
X

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి బీజేపీలో చేరిన నాయకులంతా కోమటిరెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లినా.. తాము వెళ్లబోయేది లేదని ప్రకటనలు చేస్తున్నారు. ఏడాదిన్నర కిందట కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఉప ఎన్నికలో సొంత నియోజకవర్గమైన మునుగోడు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయారు.

కొంతకాలం బీజేపీలో క్రియాశీలకంగా కనిపించిన రాజగోపాల్ రెడ్డి కొద్దిరోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో కోమటిరెడ్డి తిరిగి సొంతగూటికి చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. అందరూ భావించినట్లే ఇవాళ కోమటిరెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనుకొని ఆ పార్టీలో చేరానని, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరతానని తెలిపారు.

కోమటిరెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరిన వివేక్, మర్రి శశిధర్ రెడ్డి కూడా త్వరలో సొంత గూటికి చేరుకుంటారని ప్రచారం ప్రారంభమైంది. ఈ వార్తలపై స్పందించిన వివేక్ తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. బీజేపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని తెలిపారు.

వివేక్ బీజేపీలోనే కొనసాగుతానని ప్రకటన చేసిన కొంతసేపటికే మర్రి శశిధర్ రెడ్డి కూడా స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరమన్నారు. బీజేపీ ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అని భావించి కొందరు నేతలు అటువైపు వెళుతున్నారని చెప్పారు. కానీ, భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తాను కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఇది నిజం కాదని చెప్పారు. తాను గాలికి వచ్చి వెళ్లేవాడిని కాదన్నారు. బీజేపీలోనే కొనసాగుతానని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు.

First Published:  25 Oct 2023 5:30 PM IST
Next Story