'మార్కెట్ బాక్స్ యాప్' మోసం... నలుగురి అరెస్ట్, 10 కోట్లు స్వాధీనం
'మార్కెట్ బాక్స్ యాప్' పేరుతో ఓ రాజస్థాన్ ముఠా కోట్ల రూపాయల దోపిడికి పాల్పడింది. మూడు నెలలు కష్టపడి సైబరాబాద్ పోలీసులు ఆ ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. దాదాపు పది కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ క్రైం అనేక రూపాల్లో విలసిల్లతున్నది. ఆన్ లైన్ మోసగాళ్ళు రోజుకో తీరుతో క్రియేటివిటీ చూయిస్తున్నారు. అనేక మంది ప్రజలు ఈ సైబర్ క్రైం వల్ల కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
అలా కోట్లు కొల్లగొట్టిన ఓ సైబర్ క్రైం ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
'మార్కెట్ బాక్స్ యాప్' అనే ఓ యాప్ ద్వారా కొందరు ట్రేడింగ్, పెట్టుబడుల వ్యాపారం అంటూ అనేక మందిని ఆకర్శించారు. పది మంది సభ్యులు గల రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ముఠా నడుపుతున్న ఈ యాప్ మోసపు వలలో అనేక మంది పడిపోయారు. దాదాపు 10 కోట్ల మేర నష్టపోయారు.
హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఈ యాప్ లో 62 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు. 34 లక్షలు కోల్పోయాడు. దాంతో ఆయన సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేశాడు. దాంతో దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు ఆ ముఠా రాజస్థాన్ నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు. వాళ్ళను పట్టుకోవడానికి పోలీసు బృందం వెళ్ళి రకరకాల వేశాలతో మూడు నెలలపాటు కాపు కాసి చివరికిముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. వాళ్ళ నుండి 9 కోట్ల 81 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా దోచుకున్న సొమ్ముతో అక్కడ పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మార్కెట్ బాక్స్ యాప్ సెబీ లో నమోదు కాలేదని, ప్రజలు ఏ విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకోకుండా ఆ యాప్ లో ఉన్న వివరాలన్నీనిజమే అని నమ్మేయడం వల్ల సులభంగా మోసపోతున్నారని చెప్పారు.