తెలంగాణలో మళ్లీ యాక్టివేట్ అయిన మావోయిస్టులు.. అప్రమత్తం అయిన పోలీసులు
రాష్ట్రంలో తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తుంది. వారం రోజుల కిందట కొంత మంది నక్సల్స్ అదిలాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయ్యారు. వాళ్లు సీపీఐ-మావోయిస్టు పార్టీకి చెందిన వారే అని పోలీసులు చెబుతున్నారు.
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం అంటే నక్సలైట్లకు సేఫ్ జోన్. మావోయిస్టు పార్టీగా మారిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ల ప్రభావం ఎక్కువగానే ఉన్నది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడంతో క్రమంగా తెలంగాణను వదిలి పక్కన ఉన్న మహారాష్ట్ర, ఒడిశా, ఏవోబీలకు వెళ్లిపోయారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా ఉత్తర తెలంగాణలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకున్నారు. కానీ,గత కొంతకాలంగా ఆ పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులు, వారి సానుభూతిపరులను టార్గెట్ చేయడంతో ఇప్పుడు ఆ పేరు ఎత్తడానికి కూడా భయపడుతున్నారు. కాగా, ఇటీవల మావోయిస్టులు మరోసారి తెలంగాణలో యాక్టివేట్ అయినట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వారం రోజుల కిందట కొంత మంది నక్సల్స్ అదిలాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయ్యారు. వాళ్లు సీపీఐ-మావోయిస్టు పార్టీకి చెందిన వారే అని పోలీసులు చెబుతున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి 10 మంది మావోయిస్టులు వచ్చినట్లు కచ్చితమైన సమాచారం అందడంతో ఇప్పటికే కూంబింగ్ ఆపరేషన్స్ మొదలు పెట్టారు. అంతే కాకుండా అదిలాబాద్ జిల్లాలోని కొంత మంది సర్పంచ్, వార్డు మెంబర్ల సహాయంలో పోలీసులు గ్రామాల్లోకి వెళ్తున్నారు. అక్కడి గ్రామస్తులతో మాట్లాడి.. మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయవద్దని కోరుతున్నట్లు తెలుస్తుంది.
నిషేధించబడిన మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలని గ్రామస్తులకు పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వాళ్లు, సాయుధులు కనిపిస్తే వెంటనే ఇన్‌ఫార్మ్ చేయాలని సూచించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల నుంచి మావోయిస్టులు వచ్చి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలంటే తప్పకుండా కొంతకాలం ఈ ప్రాంతంలోనే ఉండాలి. తెలంగాణ గ్రామాల్లో ఇప్పటికీ మావోయిస్టులకు సహకారం దొరుకుతుంది. అందుకే పోలీసులు పలు గ్రామాల్లోకి తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులకు షెల్టర్ ఇవ్వొద్దని చెప్తున్నారు.
ప్రతీ గ్రామ పంచాయతీలోని ముఖ్యమైన లీడర్ల సహాయం తీసుకుంటూ పోలీసులు మావోయిస్టుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదిలాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయ్యింది ఏ దళ సభ్యులో సమాచారం లేకపోయినా.. గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన వారే అయ్యుంటారని పోలీసులు భావిస్తున్నారు. యాంటీ మావోయిస్ట్ కమాండో యూనిట్ అయిన గ్రేహౌండ్స్.. లోకల్ పోలీసుల సాయంతో ఇప్పటికే కూంబింగ్ ఆపరేషన్ మొదలు పెట్టింది. కాగా, 2020లో చివరిసారిగా అదిలాబాద్‌లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ తర్వాత పోలీసులు జిల్లా వ్యాప్తంగా కఠినమైన చర్యలు తీసుకోవడంతో మావోయిస్టులు ఇటువైపు రాలేదు. రెండేళ్లు అదిలాబాద్‌లో వారి జాడే లేకుండా పోయింది. కానీ, అకస్మాత్తుగా వారం కిందట ఒక దళం ప్రవేశించడంలో మళ్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు.