తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రత్యేకతలు ఇవే..
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను గుర్తించలేక ఓటమి చవిచూసింది. ఇక ఈ ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన విషయం తెలిసిందే. హంగ్‌కు అవకాశం లేకుండా కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటడంతో నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను గుర్తించలేక ఓటమి చవిచూసింది. ఇక ఈ ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. అవేమిటంటే..
రెండేసి స్థానాల్లో ఈసారి ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. బీఆర్‌ఎస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ రెండేసి స్థానాల్లో పోటీలో నిలవడం ఆసక్తికరంగా మారింది. అయితే ముగ్గురూ ఓటమి చవిచూడటం షాకింగ్ అంశమే. సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి బరిలో నిలవగా, గజ్వేల్‌లో విజయం సాధించారు. కామారెడ్డిలో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచారు. ఇక రేవంత్‌రెడ్డి కొడంగల్‌తో పాటు కేసీఆర్‌ని సవాల్ చేస్తూ కామారెడ్డిలోనూ బరిలో దిగారు. ఆయన కొడంగల్‌లో విజయం సాధించగా, కామారెడ్డిలో ఓడిపోయి మూడో స్థానంలో నిలవడం గమనార్హం. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రేవంత్‌రెడ్డిలపై ఆయన విజయం సాధించడం నిజంగా చరిత్రలో నిలిచిపోయే అంశమే. ఇక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి బరిలోకి దిగారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తానని ఆయన సవాల్ విసిరారు. అయితే చివరికి రెండుచోట్లా ఆయన ఓటమి పాలవడం గమనార్హం. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ రెండుచోట్లా గెలుపొందకపోవడంతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది.
♦ మరో విశేషమేమిటంటే.. 2018 ఎన్నికల తర్వాత మధ్యలో నాలుగు ఉప ఎన్నికలు జరిగాయి. అవి దుబ్బాక, హుజూర్ నగర్, మునుగోడు, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో. ఆయా ఉప ఎన్నికల్లో గెలుపొందినవారు ఈసారి ఓటమి చవిచూడడం గమనార్హం.
♦ ఈ సారి ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. మరికొందరు గెలుపొందినప్పటికీ.. మెజారిటీలు మాత్రం తగ్గాయి.
♦ స్పీకర్‌గా పనిచేసినవారు ఓడిపోతారనే ఓ అపోహ ఉండేది. ఈసారి బీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించి ఆ అపోహలకు చెక్ పెట్టారు.
♦ ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన అన్నదమ్ములు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ విజయం సాధించారు. అలాగే బీజేపీని వీడి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గడ్డం వివేక్, ఆయన సోదరుడు వినోద్ ఇద్దరూ ఈసారి బరిలో నిలిచి గెలుపొందారు.
♦ ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన భార్యాభర్తలు కూడా గెలుపొంది ఇద్దరూ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. వారు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి. వీరిద్దరూ కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందారు.
♦ ఇక బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా బరిలో దిగిన మామా అల్లుళ్లు చామకూర మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి ఇద్దరూ విజయం సాధించారు.
♦ ఈసారి ఎన్నికల్లో 30 ఏళ్లలోపు వయసు వారు ముగ్గురు గెలుపొందారు. మైనంపల్లి రోహిత్, చిట్టెం పర్ణికారెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఈ ముగ్గురూ కాంగ్రెస్ తరఫునే పోటీచేశారు.
♦ మునుగోడులో సిట్టింగ్ స్థానాన్ని వీడిన రాజగోపాల్ రెడ్డికి ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. తాజా ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన ఆయన ఈసారి గెలుపొందడం విశేషం.
♦