పేదల కిడ్నీలు అమ్మేస్తున్నారు.. - బాధితుల్లో ఎక్కువమంది బెంగళూరు, హైదరాబాద్‌వారే
కిడ్నీ మార్పిడి సర్జరీ వికటించడంతో ఒక యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పేద యువకులే లక్ష్యంగా వారి కిడ్నీలు అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం తాజాగా బయటపడింది. కేరళలో వెలుగుచూసిన ఈ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌కు సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్యుడని అక్కడి పోలీసులు గుర్తించారు. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాసిర్ అనే కీలక నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు దళారులు ఈ రాకెట్‌ను నడిపించారని, అందులో ఒక వైద్యుడు ఉన్నాడని తేలింది. దీంతో ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలో అక్కడి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ ముఠాలోని మరో ఇద్దరు దళారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది.
వెలుగులోకి వచ్చింది ఇలా..
కిడ్నీ మార్పిడి సర్జరీ వికటించడంతో ఒక యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో బెంగళూరు, హైదరాబాద్‌లకు చెందిన పేద యువకులను ఈ ముఠా సభ్యులు ఇరాన్ తీసుకెళ్లి.. అక్కడ వారి కిడ్నీలను విక్రయింపజేస్తున్నారని గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముఠాలోని కీలక సభ్యుడు సబిత్.. ఇరాన్ నుంచి కొచ్చి రాగా.. గత ఆదివారం అక్కడి విమానాశ్రయంలో కేరళ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సోమవారం అతడిని అంగమాలి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
40 మంది యువకుల కిడ్నీలు అమ్మేశారు..
ఈ ముఠా సభ్యులు బెంగళూరు, హైదరాబాద్‌లకు చెందిన 40 మంది యువకులకు డబ్బు ఆశ చూపి.. వారిని ఇరాన్‌కు తీసుకెళ్లి.. వారి కిడ్నీలు అమ్మేశారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో సబిత్ అంగీకరించాడు. డబ్బు అవసరం ఉన్న పేద యువతను గుర్తించి.. వారికి డబ్బు ఆశ చూపి.. కిడ్నీలు విక్రయించేలా దళారులు ఒప్పిస్తున్నారని అతను వెల్లడించాడు. వారికి కావాల్సిన పాస్‌పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూర్చి.. ఇరాన్‌కు తరలిస్తున్నారని వివరించాడు. ఇరాన్‌లో రక్తసంబంధీకులు కానివారు అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే అక్కడికి తీసుకెళ్తున్నారని దర్యాప్తులో తేలింది. కిడ్నీ మార్పిడి అనంతరం 20 రోజుల పాటు దాతను ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంచి.. కోలుకున్న అనంతరం స్వస్థలానికి తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు రూ.20 లక్షల వరకూ ఇస్తామని తొలుత ఆశ చూపుతున్నారని, ఆ తర్వాత ఖర్చులన్నీ చూపించి.. రూ.6 లక్షలు వారికి ముట్టజెబుతున్నారని విచారణలో వెల్లడైంది.
కీలక నిందితుడు హైదరాబాద్ వైద్యుడే..
కేరళ పోలీసుల రిమాండ్ రిపోర్టులోని వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు ఈ కేసులో కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ వైద్యుడు, సబిత్‌ల మధ్య స్నేహం మొదలైందని సమాచారం. ఇక కిడ్నీ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న హైదరాబాద్ వైద్యుడు తన కచ్చితమైన వివరాలు ముఠా సభ్యులకు అందించలేదని తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా పట్టుబడ్డా తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు చెప్పి ఉంటాడని భావిస్తున్నారు. ఇక కిడ్నీ దానం చేసిన యువకులు ఎవరన్నది కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. తద్వారా మరింత మంది ముఠా సభ్యుల గుట్టు బయటపడే అవకాశముంటుంది.