రూ.300 కోట్లతో మోనిన్ సంస్థ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్.. భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్
40 ఎకరాల్లో ఈ పరిశ్రమ నిర్మించనున్నారు. ఇది పూర్తయితే 150 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది.
డ్రింక్స్, కాక్‌టెయిల్స్‌లో కలుపుకునే సిరప్‌లను తయారు చేసే ప్రపంచ ప్రఖ్యాత 'మోనిన్' సంస్థ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించనున్నది. ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ దేశంలోనే మొట్టమొదటి సారిగా సంగారెడ్డిలో రూ.300 కోట్లతో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పుతున్నది. ఇందుకు సంబంధించిన భూమి పూజను బుధవారం పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించారు. 40 ఎకరాల్లో ఈ పరిశ్రమ నిర్మించనున్నారు. ఇది పూర్తయితే 150 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది. 18 నెలల్లో ఈ పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
మోమిన్ సంస్థ ప్రతినిధులు దేశంలోని 8 రాష్ట్రాలు తిరిగారు. ఎక్కడ కూడా పరిశ్రమ స్థాపించడానికి అనుకూలమైన విధానాలు లేవు. 2018లో సీఎం కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మోమిన్ ప్రతినిధులు కలిశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా తెలంగాణ ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలంగా సీఎం కేసీఆర్ స్పందించారు. ఇటీవల దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోర్ సదస్సు జరిగినప్పుడు మోమిన్ సంస్థ ఒప్పందం చేసుకున్నది. ఇందులో భాగంగానే ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తోందిన మంత్రి చెప్పారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.300 కోట్ల పెట్టుబడి అంటే రూ.3వేల కోట్లతో సమానం. దీని వల్ల వ్యవసాయ రంగానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమ జీవో వేస్ట్ ఇండస్ట్రీ అని చెప్పారు. ఇక్కడ నుంచి ఎలాంటి వ్యర్థాలు వెలువడమని, చుట్టు పక్కల ఉండే ప్రజలకు కూడా ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఒక పరిశ్రమ ఇక్కడికి వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వారికి సహకరించాలని కోరారు. వాళ్లకు ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే పరిష్కరించడంతో ముందుండాలని కోరారు. అంతే కాకుండా స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చేలా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాలని చెప్పారు.
వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇలాంటి కంపెనీలు వచ్చి మన ప్రాంతంలో ఫ్యాక్టరీలు నెలకొల్పుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని స్థానిక నాయకులను, అధికారులను కోరారు. వాళ్లను అతిథులుగా గౌరవించి, ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కారణంగా ఈ రోజు దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో పంటల విస్తీర్ణం, దిగుబడి పెరిగిందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఇప్పుడు పంజాబ్, హర్యానాను దాటి 3.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నదని అన్నారు. మన తెలంగాణలో పండే పత్తి బంగారంతో సమానమైన నాణ్యతను కలిగి ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
తెలంగాణలో ఐదు రకాల విప్లవాలు జరుగుతున్నాయి. హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం, పసుపు విప్లవం రాష్ట్రంలో ఐదు రకాల ఉత్పత్తులను పెంచడానికి దోహదపడుతున్నాయని చెప్పారు. రైతులకు, మత్స్యకారులకు, యాదవులకు, ఇతర అనేక మందికి ఉపాధిని, ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వలో రాష్ట్రానికి ఎన్నో దేశాల నుంచి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో సంపద సృష్టిస్తూ.. దాని ద్వారా వస్తున్న ఆదాయాన్ని సంక్షేమ పథకాలను ఉపయోగిస్తున్నామని అన్నారు. ఈ అభివృద్ధి, వేగం ఇలాగే కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్‌కు ఓటు వేసి సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్స్ సీఎంగా గెలపించాలని మంత్రి కేటీఆర్ కోరారు.