మాణిక్కంకి సెలవు.. మాణిక్ కి స్వాగతం
ఇటీవల దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి పరిస్థితిని అంచనా వేసి వెళ్లారు. అధిష్టానానికి నివేదిక అందించారు. ఆ తర్వాత మాణిక్కం ఠాగూర్ ని అధిష్టానం తప్పించింది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవి విషయంలో జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. మాణిక్కం ఠాగూర్ ఉన్నారా లేదా, కేవలం వాట్సప్ గ్రూప్ ల నుంచే లెఫ్ట్ అయ్యారా, అసలు పదవి నుంచి ఇంకా లెఫ్ట్ కాలేదా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. వాటికి తెరదించుతూ అధిష్టానం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మాణిక్కం ఠాగూర్ ని తెలంగాణ ఇన్ చార్జ్ బాధ్యతలనుంచి తప్పించింది. ఆయనకు గోవా వ్యవహారాలు అప్పగించింది. ఇక కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జ్ గా మాణిక్ రావు ఠాక్రేకి అవకాశమిచ్చింది. ఈమేరకు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది.
సీనియర్లతో విభేదాలు...
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఎలాంటి విభేదాలు లేవు. అయితే రేవంత్ ని వ్యతిరేకిస్తున్న సీనియర్లకు మాణిక్కం ఠాగూర్ టార్గెట్ అయ్యారు. రేవంత్ కి ప్రత్యామ్నాయం వెదకడం కష్టమే, అదే సమయంలో మాణిక్కం ఠాగూర్ ని సాగనంపడం పెద్ద కష్టమేమీ కాదనుకున్న సీనియర్లు.. ఆయనపై అధిష్టానానికి కంప్లయింట్ చేశారు. ఇటీవల దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి పరిస్థితిని అంచనా వేసి వెళ్లారు. అధిష్టానానికి నివేదిక అందించారు. ఆ తర్వాత మాణిక్కం ఠాగూర్ పై వేటు పడింది.
వేగలేక తప్పుకున్నారా..?
మరోవైపు మాణిక్కం ఠాగూర్, తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను వేగలేక పక్కకు తప్పుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మాణిక్కం ఠాగూర్ పై కూడా ఒత్తిడి పెరిగింది. అటు సీనియర్ల సహకారం లేకపోవడంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ దశలో తెలంగాణ వ్యవహారాలను గాడిన పెట్టడం ఆయనకు కత్తిమీద సాములా మారింది. అందుకే సైలెంట్ గా రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారనే వాదన కూడా వినపడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ వాట్సప్ గ్రూప్ ల నుంచి ఆయన లెఫ్ట్ కావడంతో రాజీనామా పక్కా అని తేలిపోయింది. ఈరోజు అధిష్టానం కొత్త నియామకం చేపట్టడంతో విషయం పూర్తిగా బయటపడింది.
ఎవరీ మాణిక్ రావు ఠాక్రే..?
మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రే గతంలో ఆ రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మాణిక్కం ఠాగూర్ కి మాట వినని తెలంగాణ సీనియర్లు ఇప్పుడు మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో ఎలా పనిచేస్తారనేది చూడాలి.