నాకంటే మోడీ, కిషన్ రెడ్డిని మందకృష్ణ ఎక్కువగా నమ్ముతున్నారు
ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి

ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాం. ఏళ్లుగా వాయిదా పడుతున్న కేసులో బలమైన వాదనలతో అత్యున్నత న్యాయస్థానాన్ని మెప్పించాం. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదు. ఎస్సీ వర్గాలకు నేను సీఎంగా ఉన్నప్పుడైనా న్యాయం చేయాలని బలంగా నమ్మాను. సమన్వయం చేసుకుంటూ శాసనసభలో అందరినీ కూడగట్టాం. బిల్లును ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయలేదు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాం. ఎస్సీలో గ్రూప్-1 ఒక శాతం, గ్రూప్-2 కు 9 శాతం, గ్రూప్-3 కి 5 శాతం రిజర్వేషన్లు కల్పించాం. అతి తక్కువ జనాభా కలిగి అభివృద్ధి ఫలాలు ఆశించిన వారిని గ్రూప్-1లో ఉంచామన్నారు. మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. నాకంటే మోడీ, కిషన్ రెడ్డిని ఆయన ఎక్కువగా నమ్ముతున్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట ఎస్సీవర్గీకరణ అమలు చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు.