Telugu Global
Telangana

Manchiryala: శిశువుల మార్పిడిలో నిజమెంత? తల్లులకు అసలు విషయం తెలుసా ?

మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో మ‌మత, పావని అనే ఇద్దరు మహిళలకు డెలివరీ అయ్యింది. ఈ ఇద్దరిలో ఒకరికి మగ బిడ్డ, మరొకరికి ఆడ బిడ్డ జన్మించారు. ఆ విషయాన్ని నర్సులు ఆ ఇద్దరు శిశువులను చూపించి మరీ తల్లులకు చెప్పారు.

Manchiryala: శిశువుల మార్పిడిలో నిజమెంత? తల్లులకు అసలు విషయం తెలుసా ?
X

మంచిర్యాల ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ఇద్దరు ప‌సిబిడ్డలు తారుమారయ్యారంటూ నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీసు కేసు కూడా నమోదయ్యింది. ఈ అంశంపై ఇరు కుటుంబాల వాదనలు, ఆస్పత్రి సిబ్బంది వాదనలు ఒక సారి పరిశీలిస్తే ఏం జరిగిందీ అర్దమయ్యే అవకాశం ఉంది.

మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో మ‌మత, పావని అనే ఇద్దరు మహిళలకు డెలివరీ అయ్యింది. ఈ ఇద్దరిలో ఒకరికి మగ బిడ్డ, మరొకరికి ఆడ బిడ్డ జన్మించారు. ఆ విషయాన్ని నర్సులు ఆ ఇద్దరు శిశువులను చూపించి మరీ తల్లులకు చెప్పారు.అయితే ఆ తర్వాత ఆ బిడ్డలిద్దరినీ వైద్య పరీక్షల కోసం తీసుకెళ్ళారు. ఆ సమయంలో మొదట ఉన్న నర్సులు కాకుండా వేరే నర్సులు డ్యూటీలోకి వచ్చారు. ఆ సమయంలో ఆడబిడ్డ‌ను కన్న తల్లి కుటుంబ సభ్యులు వచ్చి తమ శిశువును చూపించవల్సిందిగా కోరారు. ఆ సమయంలో అక్కడున్న నర్సులు పొరపాటున మగ శిశువును తీసుకొచ్చి చూపించారు. కుటుంబ సభ్యులంతా మగబిడ్డ పుట్టాడనుకున్నారు. అయితే తల్లికి మాత్రం అప్పటికే తనకు పుట్టింది ఆడ బిడ్డ అనే విషయం తెలుసు.

ఇది జరిగిన తర్వాత అసలు విషయం తెలిసుకున్న నర్సులు వీరికి ఆడబిడ్డను తెచ్చి అప్పగించారు. దాంతో కుటుంబ సభ్యులు గొడవ మొదలు పెట్టారు. తమ అమ్మాయికి మగ బిడ్డ పుడితే బిడ్డను మార్చేశారని ఆరోపణ చేశారు. గొడవ పెద్దదయ్యి పోలీసు స్టేషన్ కు వెళ్ళింది. ఇక ఎవరి బిడ్డ ఎవరో తేల్చడం కోసం డీఎన్ఏ ప‌రీక్ష ఒక్క‌టే మార్గ‌మ‌ని అధికారులు నిర్ణ‌యించారు. ఫ‌లితం రావ‌డానికి క‌నీసం 15 రోజులు స‌మ‌యం ప‌డుతుంది.

అయితే తనకు ఆడ బిడ్డ పుట్టిందని తెలిసి కూడా మౌనంగా ఉన్న తల్లి ఎందుకలా ఉంది అనేది ఒక ప్రశ్న అయితే ఈ గొడవకు ఆడ‌పిల్లల పట్ల ఉన్న వివక్ష, మగపిల్లాడే కావాలన్న పురుషాధిపత్య భావజాలం కారణం. దాంతో పాటు ఈ గొడవను పెంచి పోషించి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావాలన్న ఆలోచన‌తో కొన్ని కార్పోరేట్, ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న కుట్ర కూడా ఉంది అనే ప్రచారం జరుగుతోంది.

మరో వైపు మీడియా కూడా సెంటి మెంట్లు రెచ్చగొట్టే ప్రచారాన్ని మొదలు పెట్టింది. డీఎన్ ఏ రిపోర్టులు వచ్చే దాకా, అంటే 15 రోజుల పాటు ఆ శిశువులు తల్లులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, తల్లి పాలకు దూరమయ్యారని రాస్తున్నారు. అయితే ఆస్పత్రి సిబ్బందికి ఎవరి బిడ్డ ఎవరో స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ 15 రోజుల పాటు వారి వారి బిడ్డలను వారి దగ్గరే ఉంచినట్లైతే , డీఎన్ ఏ రిపోర్ట్ వచ్చాక ఆస్పత్రి సిబ్బంది చెప్తున్నట్టే రిపోర్ట్ వస్తే ఏ సమస్యా లేదు. ఒక వేళ మరో రకమైన రిపోర్ట్ వస్తే శిశువులను అప్పుడు మార్చొచ్చు కదా !

First Published:  28 Dec 2022 5:21 PM IST
Next Story