హైదరాబాద్ లో 'మన యాత్రి'.. క్యాబ్ డ్రైవర్లకు గిట్టుబాటవుతుందా..?
'నమ్మ యాత్రి' అనే యాప్ బెంగళూరులో విజయవంతంగా నడుస్తోంది. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వెంటనే అమలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
క్యాబ్ సర్వీసుల మధ్య పోటీ ఉన్నా కూడా.. ఆయా సంస్థలకే ఎక్కువ ఆదాయం వస్తుందనేది బహిరంగ రహస్యం. సొంత క్యాబ్ లు ఉన్న డ్రైవర్లకు ఇది పెద్దగా గిట్టుబాటు కాని వ్యవహారం. కేవలం కస్టమర్లకు, క్యాబ్ డ్రైవర్లకు అనుసంధానంగా ఉంటూ పెద్ద మొత్తంలో లాభాలు కళ్లజూస్తుంటాయి క్యాబ్ సర్వీస్ కంపెనీలు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా క్యాబ్ డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం వచ్చేలా 'మన యాత్రి' అనే యాప్ హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో సక్సెస్ అయిన 'నమ్మయాత్రి' స్ఫూర్తితో దీన్ని టీ-హబ్ లో రూపొందించారు. ఈ యాప్ ని అధికారికంగా మొదలు పెట్టి తొలి క్యాబ్ సర్వీసుని జెండా ఊపి ప్రారంభించారు.
బెంగళూరులో సక్సెస్..
'నమ్మ యాత్రి' అనే యాప్ బెంగళూరులో విజయవంతంగా నడుస్తోంది. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వెంటనే అమలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. టీ-హబ్ ఆధ్వర్యంలో ఈ యాప్ తయారు చేశారు. హైదరాబాద్‌లో తొలిసారిగా జీరోకమీషన్ ఆధారిత యాప్ ను ప్రవేశపెడుతున్నామని, ఇక్కడ కూడా ఇది విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) సీఈఓ టి.కోషి.
ప్రయాణికులకు కూడా..
జీరో కమిషన్ యాప్ తో డ్రైవర్లతోపాటు, ప్రయాణికులకు కూడా మేలు జరుగుతుందని అంటున్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకు థర్డ్ పార్టీ కంపెనీలకు వచ్చిన ఆదాయం ఇప్పుడు డ్రైవర్లకు, ప్రయాణికులకు దక్కుతుందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో 25వేల మందికి పైగా డ్రైవర్లు ఇప్పటికే 'మన యాత్రి' యాప్ లో రిజిస్టర్ అయ్యారు. రాబోయే 3 నెలల్లో మరో లక్షమంది ఇందులో చేరతారని తెలుస్తోంది.