'మన మునుగోడు మన కాంగ్రెస్'.. అమిత్ షా సభకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ వ్యూహం
ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ దృష్టిపెట్టింది. సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా నిలబెట్టుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం 'మన మునుగోడు మన కాంగ్రెస్' పేరుతో ఒక వ్యూహాన్ని సిద్ధం చేసింది.
తెలంగాణలో అధికారంలోకి రావాలంటే మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడొచ్చినా గెలవాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి సీనియర్ నేతల వరకు అందరూ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యలాగ మారింది. టీఆర్ఎస్ ఇంకా ఈ ఉప ఎన్నికపై బహిరంగంగా ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించలేదు. కానీ, నియోజకవర్గంలోని కీలక నాయకులతో చర్చలు, సమీక్షలు జరుపుతూ ఎన్నికకు సిద్ధంగా ఉన్నది.
ఇక బీజేపీ ఈ నెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఈ సభకు కేంద్రమంత్రి అమిత్ షా రానున్నారు. దేశంలో ఎక్కడ కీలకమైన ఎన్నికలు జరుగుతున్నా.. అక్కడకు అమిత్ షా వాలిపోవడం కొత్తేమీ కాదు. బహిరంగ సభ ద్వారా జన సమీకరణ చేసి బలం నిరూపించుకోవడంతో పాటు.. అమిత్ షా వ్యూహాలు కార్యకర్తలకు చేరవేయడం ఒక ఆనవాయితీ అని చెప్పవచ్చు. మునుగోడు సభకు వచ్చి.. ఆయన బీజేపీ నాయకత్వాన్ని, కార్యకర్తలను ఎలా సిద్ధం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
ఇక కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే ఈ నియోజకవర్గంపై పూర్తిగా దృష్టిపెట్టింది. సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా నిలబెట్టుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం 'మన మునుగోడు మన కాంగ్రెస్' పేరుతో ఒక వ్యూహాన్ని సిద్ధం చేసింది. నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు పర్యటించనున్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఆజాదీ గౌరవ్ యాత్రలు నిర్వహిస్తారు. ఆగస్టు 13న నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు 13 కిలోమీటర్ల యాత్రకు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా.. ఇతర ముఖ్య నేతలు హాజరవుతారు.
స్వాతంత్ర దినోత్సవం అనంతరం.. ఆగస్టు 16 నుంచి మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలను సిద్ధం చేయనున్నారు. 16న నాంపల్లి,, 17న మర్రిగూడ, 18న చుండూరు, 19న నారాయణపురం, చౌటుప్పల్ మండలాల కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తారు. 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 'మన మునుగోడు మన కాంగ్రెస్' పేరుతో నియోజకవర్గంలో యాత్రలు నిర్వహించనున్నారు. తర్వాతి రోజు అమిత్ షా సభ ఉంది. అదే రోజు కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్లతో నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసింది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులపై ధరల భారం ఎలా పెరిగిందో ఈ నిరసనల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఒకవైపు మునుగోడు ఉపఎన్నికలకు సిద్ధం అవుతూనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంస్థాగత బాధ్యులను ఏర్పాటు చేసింది. నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, మెదక్, చేవెళ్ల, నియోజకవర్గాలకు మాజీ ఎమ్మెల్సీ ఎన్ఎస్ బోస్‌ను, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, జహీరాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ లోక్‌సభ స్థానాలకు ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావెద్.. కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు రోహిత్ చౌదరిని బాధ్యులను చేసింది. వీళ్లు ఇప్పటికే నిర్వర్తిస్తున్న బాధ్యతలకు అదనంగా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పర్యవేక్షణ కూడా చేయనున్నట్లు పార్టీ తెలిపింది.