ప్రేమోన్మాది ఘాతుకం.. - తనను ప్రేమించడం లేదని యువతి గొంతుకోసిన వైనం
ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైందని తెలిసి కిషోర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. సోమవారం సాయంత్రం లక్ష్మి తన తల్లితో కలిసి స్కూటీపై వెళ్తుండగా వారిని బైక్‌పై వెంటాడాడు.
ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదని ఓ యువతి గొంతుకోశాడు. హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోరబండ లో సోమవారం సాయంత్రం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. దీంతో యువతి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏడేళ్లుగా పరిచయం..
బోరబండ మోతీనగర్‌లో నివాసం ఉంటున్న కిషోర్ (28)కి, రామారావునగర్‌లో నివాసం ఉంటున్న సిద్ధప్ప, శాంతమ్మల కుమార్తె లక్ష్మి (25)కి ఏడేళ్లుగా పరిచయం ఉంది. నిందితుడు కిషోర్ గతంలో బోరబండలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపేవాడు. అప్పట్లో లక్ష్మి అక్కడే పనిచేసేది. ఆ తర్వాత కిషోర్ ఆ సెంటర్ మూసివేసి.. తన మామయ్యను నడుపుతున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. లక్ష్మి మాత్రం మాదాపూర్‌లో హౌస్‌కీపింగ్ పనిచేస్తోంది.
కళ్లలో కారం చల్లి.. కత్తితో పీక కోసి..
లక్ష్మిని ప్రేమిస్తున్నానంటూ కిషోర్ ఆమెతో పరిచయం అయినప్పటి నుంచీ వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరిస్తోంది. ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైందని తెలిసి కిషోర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. సోమవారం సాయంత్రం లక్ష్మి తన తల్లితో కలిసి స్కూటీపై వెళ్తుండగా వారిని బైక్‌పై వెంటాడాడు. బంజారానగర్ మెయిన్ రోడ్డులో స్కూటీకి బైక్ అడ్డుపెట్టాడు. వెంటనే ఆమె కళ్లలో కారం చల్లాడు. హఠాత్పరిణామంతో లక్ష్మి, ఆమె తల్లి శాంతమ్మ కిందపడిపోయారు. వెంటనే కిషోర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో లక్ష్మి పీక కోసేందుకు ప్రయత్నించాడు. జనం అందరూ చూస్తుండగానే ఈ ఘటనకు తెగించాడు. ఈ క్రమంలో లక్ష్మి అతని నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా అప్పటికే ఆమె మెడ కొంత తెగిపోయింది.
స్థానికులు అడ్డుకోవడంతో..
ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ ఆటో డ్రైవర్, మరికొందరు యువకులు కిషోర్‌ని అడ్డుకుని దేహశుద్ధి చేశారు. గాయపడిన లక్ష్మిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.