రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇచ్చారు.. అన్నీ చెప్పేస్తా
తప్పుడు పత్రాలతో, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లతో తనను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు మల్లారెడ్డి. తన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇచ్చారని, అన్ని విషయాలు ఆయనతో చెప్పేస్తానని అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. సికింద్రాబాద్ సుచిత్ర పరిధిలో ఉన్న భూవివాదం వ్యవహారంపై ఆయన తాజాగా స్పందించారు. ఈ వివాదాన్ని సీఎం వద్ద పరిష్కరించుకుంటామన్నారు. తనని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు మల్లా రెడ్డి.
తప్పుడు పత్రాలతో, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లతో తనను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు మల్లారెడ్డి. తన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తన దగ్గర పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయని, ఆధారాలు చూపిస్తున్నా పోలీసులు తన మాట వినడంలేదని చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వద్దే తేల్చుకుంటామని, విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని అన్నారు మల్లారెడ్డి.
సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నర ఎకరాల విషయంలో ఈవివాదం చెలరేగింది. మల్లారెడ్డి సహా మరో 15 మంది మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ భూమి మొత్తం తమదేనని మల్లారెడ్డి కుటుంబం చెబుతోంది. అయితే అందులో 1.11 ఎకరాల భూమి తమదేనని మిగతా 15మంది వాదిస్తునాారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు వారు కూడా చూపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల ఆ 15మంది కలసి ఫెన్సింగ్ వేశారు. దాన్ని తొలగించడానికి మల్లారెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత గొడవ మరింత పెద్దదైంది. తీరా ఇప్పుడు ఈ పంచాయితీ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరేలా ఉంది.