Telugu Global
Telangana

మల్లా రాజిరెడ్డి క్షేమమే.. ఆగ్రనేత మరణంపై మావోయిస్టు పార్టీ క్లారిటీ

రాజిరెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరూ పార్టీకి టచ్‌లోనే ఉన్నారని.. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన ఇబ్బందులు లేవని ప్రకటనలో పేర్కొన్నారు.

మల్లా రాజిరెడ్డి క్షేమమే.. ఆగ్రనేత మరణంపై మావోయిస్టు పార్టీ క్లారిటీ
X

సీపీఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ సాయన్న.. కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అలియాస్ విజయ్ క్షేమంగా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. వారిద్దరూ మరణించినట్లు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ పార్టీ నార్త్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి మంగ్లి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాజిరెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరూ పార్టీకి టచ్‌లోనే ఉన్నారని.. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన ఇబ్బందులు లేవని ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల రాజిరెడ్డి మరణించినట్లు, ఆయన మృతదేహం వద్ద పార్టీ క్యాడర్ విలపిస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత మీడియాలో కూడా ఆయన మరణించినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో రాజిరెడ్డి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు కట్టా రామచంద్రారెడ్డి మరణ వార్తపై కూడా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆందోళన చెందారు. అందుకే ఈ క్లారిటీ ఇస్తున్నట్లు ప్రకటనతో మావోయిస్టు పార్టీ పేర్కొన్నది. ఇటీవల అగ్ర నాయకుల మరణాలపై పలు తెలుగు, హిందీ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాల వెనుక కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు మావోయిస్టు పార్టీ పేర్కొన్నది.

ఇలాంటి అబద్దపు కథనాల ద్వారా ప్రజలను అయోమయంలో ముంచెత్తాలని, విప్లవ విజయం పట్ల అవిశ్వాసం కలిగించడానికి.. మా నాయకుల ఆనుపానులు తెలుసుకోవడానికే ఉద్దేశపూర్వకంగా ఈ అబద్ధపు ప్రచారం చేశారని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

First Published:  22 Aug 2023 5:29 PM IST
Next Story