Telugu Global
Telangana

మల్కాజ్ గిరి.. ఓ కొలిక్కి..!

త్వరలో మిగిలిన 4 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఫైనల్ చేసి, వారితోపాటుగా మల్కాజ్ గిరి అభ్యర్థి మార్పు విషయాన్ని కూడా ప్రకటిస్తారనే అంచనాలున్నాయి. అయితే ఈ విషయాన్ని పార్టీ వర్గాలు కానీ, మల్లారెడ్డి వర్గం కానీ ధృవీకరించాల్సి ఉంది.

మల్కాజ్ గిరి.. ఓ కొలిక్కి..!
X

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత మల్కాజ్ గిరి వ్యవహారం వారం రోజులపాటు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆ వేడి కాస్త చల్లారినా టికెట్ కేటాయింపు ఎవరికి అనేది మాత్రం ఫైనల్ కాలేదు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకి దాదాపుగా ప్రగతి భవన్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఆయన కూడా పక్క చూపులు చూస్తున్నారు. ఈ దశలో బీఆర్ఎస్ ఆ టికెట్ ఎవరికిస్తుంది..? మైనంపల్లికి బలమైన ప్రత్యర్థి ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

తెరపైకి మల్లారెడ్డి అల్లుడు..

మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డికి దక్కే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా చెబుతున్నారు ఆయన అనుచరులు. కేసీఆర్ కూడా మర్రి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉన్నారని, మల్లారెడ్డి అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపోమాపో అధికారిక ప్రకటన వస్తుందని వారు ఆశపడుతున్నారు.

కీలక పరిణామం..

శనివారం మల్లారెడ్డి పుట్టినరోజు. కార్యకర్తలతో ఆయన బిజీగా ఉన్నారు. ఉన్నట్టుండి కేక్ కటింగ్ కార్యక్రమాలను కూడా మధ్యలో వదిలేసి సీఎం కేసీఆర్ పిలుస్తున్నారంటూ వెళ్లారు. వెళ్తూ వెళ్తూ తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా వెంట తీసుకెళ్లారు. దీంతో ఈ ప్రచారం నిజమనిపిస్తోంది. మైనంపల్లిని పక్కనపెట్టి ఇక్కడ శంభీపూర్ రాజుకి టికెట్ ఇస్తారనే ప్రచారం ఇటీవల జరిగింది. అయితే ఫైనల్ గా కేసీఆర్, మల్లారెడ్డి అల్లుడి వైపు మొగ్గుచూపారని ప్రచారం జరుగుతోంది. త్వరలో మిగిలిన 4 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఫైనల్ చేసి, వారితోపాటుగా మల్కాజ్ గిరి అభ్యర్థి మార్పు విషయాన్ని కూడా ప్రకటిస్తారనే అంచనాలున్నాయి. అయితే ఈ విషయాన్ని పార్టీ వర్గాలు కానీ, మల్లారెడ్డి వర్గం కానీ ధృవీకరించాల్సి ఉంది.

First Published:  10 Sept 2023 3:02 AM GMT
Next Story