Telugu Global
Telangana

ప్రధాన పార్టీల డోర్స్‌ క్లోజ్‌.. చిన్న పార్టీలవైపు ఆశావహుల చూపు

టికెట్‌ రాని ఆశావహులు ప్రజలకు పరిచయమున్న పార్టీల నుంచి పోటీకి దిగితే బాగుంటుందని భావిస్తున్నారు. సొంత బలంతోనే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రధాన పార్టీల డోర్స్‌ క్లోజ్‌.. చిన్న పార్టీలవైపు ఆశావహుల చూపు
X

ప్రధాన పార్టీలు బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు ఇప్పుడు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అవకాశాలను వెతుక్కుంటున్నారు. ఇక కాంగ్రెస్‌, బీజేపీలు అధికారికంగా తమ అభ్యర్థులను ప్రకటించనప్పటికీ.. కొందరు కీలక నేతలు ఆటోమెటిక్‌గా వారి స్థానాల నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మరోవైపు మూడు ప్రధాన పార్టీలతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, జనతాదళ్‌, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌, యుగ తులసి లాంటి కొన్ని కొత్త పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. తెలంగాణలో 100 స్థానాల్లో పోటీ చేస్తామని NCP ఇప్పటికే ప్రకటించింది.

టికెట్‌ రాని ఆశావహులు ప్రజలకు పరిచయమున్న పార్టీల నుంచి పోటీకి దిగితే బాగుంటుందని భావిస్తున్నారు. సొంత బలంతోనే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ అన్ని నియోజకవర్గాల్లో కొంత ఓటు బ్యాంకును కలిగి ఉంది. ప్రధాన పార్టీల్లో టికెట్ రాని నేతలంతా బీఎస్పీ తమకు అవకాశం ఇస్తుందని భావిస్తున్నారు.

తెలంగాణలో ప్రత్యేకంగా మహారాష్ట్రతో సరిహద్దు ఉన్న జిల్లాల్లో 60 స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన ఏక్‌నాథ్‌ షిండే వర్గం తెలిపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ తరపున పోటీ చేసిన కోరుకంటి చందర్‌ రామగుండం నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఎస్పీ టికెట్‌పై గెలిచి తర్వాత అధికార పార్టీలో చేరారు.

First Published:  9 Oct 2023 10:34 AM IST
Next Story