Telugu Global
Telangana

సభలో అవమానం.. నేలపై కూర్చుని ఎమ్మెల్యే సబిత నిరసన

ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు? ఇదేనా ప్రజా పాలన? అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

సభలో అవమానం.. నేలపై కూర్చుని ఎమ్మెల్యే సబిత నిరసన
X

మహేశ్వరంలో జరిగిన అధికారిక కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. సభలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించారని, ప్రొటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని స్టేజ్ పైకి పిలవడమేంటని వారు నిలదీశారు. తనకు జరిగిన అవమానానికి బదులుగా నేలపై కూర్చుని మాజీ మంత్రి సబిత నిరసన తెలియజేశారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. గెలిచిన అభ్యర్థి నేలపై, ఓడిపోయిన అభ్యర్థి స్టేజ్ పై ఉండటమేంటని ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

ప్రజా పాలన అంటే ఇదేనా..?

ఓడిపోయిన అభ్యర్థులు స్టేజ్ పైన, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యే స్టేజ్ కింద.. ఉండటమేంటని ట్విట్టర్ వేదికగా నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారిక కార్యక్రమంలో ఓడిపోయిన అభ్యర్థులకు పనేంటని ఆయన ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు? ఇదేనా ప్రజా పాలన? అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.


హరీష్ రావు ఆగ్రహం..

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మూడు సార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా? అని ప్రశ్నించారు హరీష్ రావు.



First Published:  15 July 2024 12:30 PM GMT
Next Story