Telugu Global
Telangana

తెలంగాణలో కలపాలని మహారాష్ట్రలోని 14 గ్రామాలు డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న‌ పింఛన్‌ల నుండి రేషన్ వరకు, తెలంగాణ‌ ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు, ఇతర సంక్షేమ పథకాలు తమను ఎంతగానో ఆకర్షించాయని మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో ఉన్న మహరాజ్‌గూడ, నాకే వాడ సహా 14గ్రామాల ప్రజలు చెప్తున్నారు. తమ గ్రామాలు కూడా తెలంగాణలో కలపాలని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణలో కలపాలని మహారాష్ట్రలోని 14 గ్రామాలు డిమాండ్
X

తెలంగాణ మోడల్ పాలన, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర‌మాలు దేశ ప్రజలను ఆకర్శిస్తున్నాయనడానికి ఇది మరో నిదర్శనం ఇది. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్రకు చెందిన‌ 14 గ్రామాల ప్రజ‌లు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న‌ పింఛన్‌ల నుండి రేషన్ వరకు, ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు, ఇతర సంక్షేమ పథకాలు తమను ఎంతగానో ఆకర్షించాయని మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో ఉన్న మహరాజ్‌గూడ, నాకే వాడ సహా 14గ్రామాల ప్రజలు చెప్తున్నారు. తమ గ్రామాలు కూడా తెలంగాణలో భాగం కావాలని వారు ఆశ‌పడుతున్నారని ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ప్రచురించిన నివేదిక వివరించింది.

"మహారాష్ట్ర ప్రభుత్వంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రజలు అనేక ప్రయోజనాలు పొందుతున్నందున మేము మా గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలనుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం అక్కడి సీనియర్ సిటిజన్లకు రూ. 1,000 పెన్షన్, 10 కిలోల రేషన్, అనేక ఇతర ప్రయోజనాలను ఇస్తుంది, " అని నాకే వాడా గ్రామానికి చెందిన విజయ్ అనే అతను చెప్పాడు.

తెలంగాణ ప్రభుత్వం వల్ల అక్కడి ప్రజలు ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని నాకే వాడ గ్రామ ఉప సర్పంచ్ సుధాకర్ జాదవ్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ పేర్కొంది.

"ఇక్కడి ప్రజలకు మరిన్ని పథకాలను, ప్రయోజనాలను అందించాలని నేను మహారాష్ట్రకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఆయన అన్నారు.

తెలంగాణలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలిపేయాలని డిమాండ్ చేయడం ఇది తొలసారి కాదు. ఆంధ్రప్రదేశ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గుండాల, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఏటపాక, పురుషోత్తపట్నం అనే ఐదు గ్రామాల ప్రజ‌లు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది జూలైలో నిరసన చేపట్టారు.

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల సరిహద్దులోని మహారాష్ట్రకు చెందిన 46 గ్రామాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కొద్ది రోజుల క్రితం డిమాండ్ చేశారు.

బిజెపి పాలిత కర్ణాటకలోని రాయచూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, రాయచూర్‌ను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా కర్నాటక ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడం లేదని, ఈ ప్రాంత రైతుల కష్టాలను ప్రభుత్వంతో చర్చించాలని, లేదంటే రాయచూర్‌ను తెలంగాణలో కలపాలని ఓ కార్యక్రమంలో తమ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు.

2019లో మహారాష్ట్రకు చెందిన నాందేడ్, నల్గావ్, భోకర్, డెగ్లూర్, కిన్వాట్, హతగావ్ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 2018లో నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌లోని దాదాపు 40 గ్రామాలు తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ తీర్మానం కూడా చేశాయి. ఈ తీర్మాన‍లో వారు తెలంగాణలో అమలవుతున్న‌ రైతు బంధు పథకాన్ని ప్రశంసించారు. తెలంగాణలో కలిపితే తమకూ ఆ ప్రయోజనాలు లభిస్తాయని ఆశించారు.


First Published:  15 Dec 2022 2:30 AM GMT
Next Story