కేసీఆర్ సమక్షంలో భారీగా చేరికలు.. మహారాష్ట్రలో జై బీఆర్ఎస్
దేశ ప్రజల జీవితాల్లో సంపూర్ణ క్రాంతి రావాలంటే ‘కిసాన్ సర్కార్’తోనే సాధ్యమని చెప్పారు సీఎం కేసీఆర్. ప్రభుత్వాలకు బాసులు ప్రజలేనని.. రైతులు, ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు.
మహారాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మద్దతుదారులుగా మారుతున్నారు. సామాన్య ప్రజలు, కార్యకర్తలే కాదు.. వివిధ పార్టీల్లోని కీలక నేతలు కూడా బీఆర్ఎస్ కి జై అంటున్నారు. తాజాగా మరోసారి మహారాష్ట్ర నేతలు హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నారు, బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే సహా కీలక నేతలు..
అహ్మద్ నగర్ జిల్లా శ్రీరాంపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భానుదాస్ కాశీనాథ్ మురుటే బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు గులాబి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. మూడుసార్లు మురుటే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈసారి ఆయన బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసే అవకాశముంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ కమిటీ నేతలు, సహకార బ్యాంకుల మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అటు విద్యావంతులు కూడా తెలంగాణ మోడల్ పట్ల ఆకర్షితులవుతున్నారు. న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఉన్నత విద్యావంతులు కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా పలువురు న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు సీఎం కేసీఆర్ ని కలసి సంఘీభావం తెలిపారు. పార్టీలో చేరారు.
దేశ ప్రజల జీవితాల్లో సంపూర్ణ క్రాంతి రావాలంటే ‘కిసాన్ సర్కార్’తోనే సాధ్యమని చెప్పారు సీఎం కేసీఆర్. ప్రభుత్వాలకు బాసులు ప్రజలేనని.. రైతులు, ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ప్రజా ప్రభుత్వాలను మనమే ఏర్పాటు చేసుకుందామని.. అందుకే 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం ఇచ్చామని చెప్పారు కేసీఆర్. పాలకుల వైఖరిలో మార్పు రానంత వరకు అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించడానికి తెలంగాణలో ఎంతో కష్టపడి నూతన విధానాలు రూపొందించామని తెలిపారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్ట్ లు దేశానికే ఆదర్శం అన్నారు. పండిన పంటను ప్రాసెసింగ్ చేసి దేశవిదేశాలకు మార్కెటింగ్ చేసి రైతులకు మరిన్ని లాభాలు అందిస్తామని, ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు కేసీఆర్. బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. కాళేశ్వరం వంటి అద్భుతాన్ని తామెక్కడా చూడలేదని, ఇదొక వరల్డ్ వండర్ అని అన్నారు.