ఆరోగ్యశ్రీలో తొలి ఆపరేషన్ ఇదే.. నిమ్స్ వైద్యుల ఘనత
అవయవమార్పిడి ఆపరేషన్లకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఊపిరితిత్తుల మార్పిడికి సంబంధించి నిమ్స్ లో జరిగిన ఆపరేషన్ మొదటిది కావడం విశేషం.
ఏకాస్త అవకాశం ఉన్నా కూడా ఫలానా జబ్బు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదు అని దాటవేస్తుంటాయి ప్రైవేటు ఆస్పత్రులు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ జబ్బులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ, ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని గరిష్టంగా పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో అరుదైన ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా జరుగుతున్నాయి. తాజాగా ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ ను నిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయించుకున్నారు సిద్ధిపేటకు చెందిన హైమావతి అనే మహిళ. ఆరోగ్యశ్రీ పరిధిలో ఇదే తొలి ఆపరేషన్ కావడం విశేషం.
అవయవమార్పిడి ఆపరేషన్లకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఊపిరితిత్తుల మార్పిడికి సంబంధించి నిమ్స్ లో జరిగిన ఆపరేషన్ మొదటిది కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటి వరకు నిమ్స్ లో 27 అవయవమార్పిడి ఆపరేషన్లు జరిగాయి.
సిద్ధిపేటకు చెందిన హైమావతి కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే ప్రత్యామ్నాయం అని తేల్చారు వైద్యులు. దీంతో ఆమె జీవన్ దాన్ లో రిజిస్టర్ చేసుకుని ప్రస్తుతం ఇంటివద్ద ఆక్సిజన్ సిలిండర్ సాయంతో ఊపిరి తీసుకుంటున్నారు. వరంగల్ కి చెందిన విద్యార్థిని పూజ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఆమె ఊపిరితిత్తులను హైమావతికి అమర్చారు. సుమారు 12 గంటల పాటు శ్రమించి హైమావతికి ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. నిమ్స్ కు చెందిన సుమా రు 8 విభాగాల వైద్యులు, సిబ్బంది ఈ ఆపరేషన్లో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం హైమావతి ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆమె పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుందన్నారు వైద్యులు.