Telugu Global
Telangana

రూ.1,200 కోట్లతో లులు మరో కొత్త మాల్

20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న డెస్టినేషన్ మాల్ కోసం రూ.1,200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రూ.1,200 కోట్లతో లులు మరో కొత్త మాల్
X

దుబాయ్‌కి చెందిన లులు గ్రూప్ దేశంలోనే అతిపెద్ద లులు మాల్‌ను కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్, లులు గ్రూప్ చైర్మన్ యుసఫ్ అలీ ఈ మాల్‌ను బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాగా, లులు గ్రూప్ రాబోయే రెండున్నర ఏళ్లలో హైదరాబాద్‌లో భారీ మాల్‌ను నిర్మించనున్నట్లు యుసఫ్ అలీ వెల్లడించారు. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న డెస్టినేషన్ మాల్ కోసం రూ.1,200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా మారుతుందని చెప్పారు.

ఇక కూకట్‌పల్లి లులు మాల్‌ కోసం రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా 1,500 మందికి పరీక్షంగా 2,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 85 శాతం స్థానికులకే ఈ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు యుసుఫ్ అలీ తెలిపారు. లులు మాల్‌లో పళ్లు, కూరగాయలు, మాంసం తదితర తాజా ఉత్పత్తులతో పాటు కిరాణా సామాగ్రి, దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు కూడా లభిస్తాయి ఇందులో 100కు పైగా దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్ల అవుట్ లెట్లు ఉన్నాయి. 1,400 సామర్థ్యంలో ఐదు స్క్రీన్లు ఉన్నాయి. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ కూడా ఉంది.

ఫుడ్ ప్రాసెసింగ్ కోసం రూ.200 కోట్లు..

హైదరాబాద్ శివారులోని చెంగిచర్లలో మాంసం శుద్ధి చేసే అధునాతన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు లులు గ్రూప్ చైర్మన్ యుసుఫ్ అలీ చెప్పారు. రూ.200 కోట్ల వ్యయంతో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తున్నామని అన్నారు. ఇక్కడ శుద్ధి చేసిన మాంసాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ఆహారం, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఇక కేవలం భారీ మాల్స్ మాత్రమే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లో చిన్ని స్టోర్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

First Published:  27 Sept 2023 8:27 AM IST
Next Story