లవ్ స్టోరీ రివర్స్.. గొంతు కోసిన కేసులో అసలు ట్విస్ట్..
కేవలం ఓ లవ్ స్టోరీ ఫెయిలైంది, ఎమోషనల్ డ్రామా మొదలైంది, అందులో పోలీసులు ప్రేక్షకులయ్యారు. చివరకు నిజం తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మహిళ గొంతు కోసిన ఎమ్మెల్యే పీఏ అనే వార్త ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. రాజకీయ కోణంలో కూడా కొంతమంది విమర్శలు మొదలు పెట్టారు. సదరు ఎమ్మెల్యేని, వారి పార్టీని టార్గెట్ చేయాలని చూశారు. కానీ సాయంత్రానికి అసలు విషయం తేలిపోయింది. గొంతు కోయడం, చేయి విరిచేయడం.. ఇలాంటివేవీ అక్కడ జరగలేదు. కేవలం ఓ లవ్ స్టోరీ ఫెయిలైంది, ఎమోషనల్ డ్రామా మొదలైంది, అందులో పోలీసులు ప్రేక్షకులయ్యారు. చివరకు నిజం తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
నగరంలో ఓ ఎమ్మెల్యేకి పీఏగా ఉన్న విజయసింహా, నిషా అనే మహిళ మధ్య పరిచయం ఉన్న విషయం వాస్తవమే. నిషా వివాహిత కావడం, భర్తతో కలసి ఉండటంతో.. వీరిద్దరి స్నేహం కాస్త రహస్యంగానే సాగింది. అయితే ఆరోజు నిషా ఇంటికి ఆయన రావడం, ఉన్నట్టుండి గొంతుకోసి, దాడిచేసి పారిపోవడం అనేవి మాత్రం అవాస్తవం. ఉదయం గొంతుకోశాడంటూ విలవిల్లాడిపోయిన మహిళ, సాయంత్రానికి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తానింకా బాధితురాలినేనని, ఆస్పత్రిలో బాధ అనుభవించానని, తనపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరింది. కానీ విజయసింహా, అసలు బాధితుడ్ని తానేనంటున్నాడు. తమ మధ్య కేవలం పరిచయం ఉందని, ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యామని, దాడి జరిగిందని చెబుతున్న సమయంలో తానసలు అక్కడ లేనని వివరించారు. దీంతో పోలీసులు ఈకేసులో లోతుగా దర్యాప్తు చేపట్టారు. అసలు విషయం తేల్చారు.
గొంతుకోశారంటూ విలవిల్లాడిపోయిన సదరు మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించిన క్రమంలో అసలు గాయాలే లేవంటూ వైద్యులు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఈలోగా విజయసింహా స్టేట్ మెంట్లు కూడా అనుమానాలకు తావిచ్చాయి. చివరకు పోలీసుల విచారణలో నిజం బయటపడింది. విజయసింహా తనను దూరం పెడుతున్నాడనే కారణంతో బెదిరించడానికే సదరు మహిళ దాడి జరిగిందంటూ అందర్నీ తప్పుదారి పట్టించినట్టు నిర్ధారించుకున్న పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. ఉదయాన్నే మీడియా చేసిన హడావిడికి ఏదో జరిగిపోయిందని అనుకున్నా, సాయంత్రానికి బాధిత మహిళ సెల్ఫీ వీడియో విడుదల చేసి అందరికీ షాకిచ్చింది.