Telugu Global
Telangana

జీవో 29తో నష్టం అనేది అపోహ మాత్రమే

సెలక్షన్‌ ప్రక్రియలో ఎక్కడా రిజర్వుడు కేటగిరీలో అన్యాయం జరగదని..బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఫైర్‌

జీవో 29తో నష్టం అనేది అపోహ మాత్రమే
X

గ్రూప్‌-1పై బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ విమర్శించారు.ఈ రెండు పార్టీల నేతలు యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బీసీ బిడ్డగా నేను మీకు భరోసా ఇస్తున్నాను. సెలక్షన్‌ ప్రక్రియలో ఎక్కడా రిజర్వుడు కేటగిరీలో అన్యాయం జరగదు. జీవో 29తో నష్టం అనేది అపోహ మాత్రమే అన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కూడా పీసీసీ చీఫ్‌ ఫైర్‌ అయ్యారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రధాని మోడీ హామీ ఏమైందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత పదేళ్లలో బీజేపీ సర్కార్‌ ఎన్నికోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు. ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టారని ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎంతమంది ఉద్యోగాలు ఊడగొట్టిందో తమ వద్ద లెక్కలున్నాయన్నారు.

పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఒక్కసారి కూడా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. కనీసం 70 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇంటర్‌ ఫలితాలను తప్పుల తడకగా ఇచ్చి వందలాదిమంది విద్యార్థుల చావులకు కారణమైంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తికాకుండానే 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను జిరాక్స్‌ సెంటర్లలో అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఫిబ్రవరిలో విడుదలైందని, ప్రస్తుత చర్చనీయాంశమైన జీవో 29 కూడా అదే నెలలో ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పరీక్షలు తరుచూ వాయిదా మంచిది కాదని అభ్యర్థులకు సూచించారు. రాజకీయ నేతల కుట్రపూరిత ఉచ్చులో విద్యార్థులు పడవద్దని కోరారు. నిరుద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని, ఎవరిపైనా లాఠీఛార్జ్‌ చేయవద్దని మహేశ్‌ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

First Published:  20 Oct 2024 8:52 PM IST
Next Story