Telugu Global
Telangana

మా పరిస్థితి కాస్త చూడండి సార్.. కేటీఆర్ వద్దకు క్యూ కట్టిన ఆశావహులు

టికెట్లు రాని వాళ్లు డీలా పడవద్దని.. తప్పకుండా భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

మా పరిస్థితి కాస్త చూడండి సార్.. కేటీఆర్ వద్దకు క్యూ కట్టిన ఆశావహులు
X

అధికార బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని ఎంతో మంది ఆశపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా సరే.. తమకు ఈ సారి అవకాశం ఇస్తారని చాలా మంది భావించారు. గత నెల 21న బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అభ్యర్థుల లిస్టు ప్రకటించే వరకు తమదైన దారుల్లో టికెట్ కోసం ప్రయత్నించారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్ రావులను కలిసి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. అయితే ఆ సమయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండటంతో చాలా మందికి ఎలా అప్రోచ్ కావాలో అర్థం కాలేదు.

సీఎం కేసీఆర్ దాదాపు సిట్టింగులకు మరోసారి టికెట్లు ఇవ్వడంతో చాలా మంది ఆశావహులు నిరాశ చెందారు. అయితే టికెట్లు రాని వాళ్లు డీలా పడవద్దని.. తప్పకుండా భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయని కేసీఆర్ భరోసా ఇచ్చారు. పట్నం మహేందర్ రెడ్డి టికెట్ రాలేదన్న నిరాశలో ఉండటంతో ఆయనకు ఏకంగా మంత్రి పదవే ఇచ్చారు. ఇలాంటి అవకాశాలు తమకూ వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు వారాల అమెరికా, దుబాయ్ పర్యటన ముగించుకొని మంత్రి కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఆశావహులు ఆయన వద్దకు క్యూకట్టారు.

సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన రోజే మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. క్రిషాంక్ సహా చాలా మంది పని చేసే వారికి టికెట్లు రాకపోవడం బాధించింది. కానీ వారికి భవిష్యత్‌లో సముచిత స్థానం లభిస్తుంది. ప్రస్తుతం సిట్టింగులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ నిర్ణయించారు అంటూ అందులో కేటీఆర్ పేర్కొన్నారు. ఇక పెండింగ్‌లో ఉన్న నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావహులు ఇప్పుడు కేటీఆర్ వద్దకు వెళ్లి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు.

జనగామ నియోజకవర్గానికి సంబంధించి పల్లా రాజేశ్వర్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని ఆయనకు వివరించారు. అక్కడి నుంచి తనను పోటీ చేయాలని స్థానిక క్యాడర్ కోరుతున్న విషయాన్ని కూడా తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు గోషామహల్ నియోజకవర్గానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని నందకిశోర వ్యాస్ బిలాల్ కోరారు. ఆ నియోజకవర్గ ఇంచార్జిగా పార్టీ బలోపేతానికి చాలా కష్టపడ్డానని మంత్రికి చెప్పారు. ఆ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ధీటుగా బీఆర్ఎస్‌ను నిలబెట్టినట్లు పేర్కొన్నారు. ఈ సారి అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తారని మంత్రికి వివరించినట్లు తెలుస్తున్నది.

నల్గొండ జిల్లా సీనియర్ నాయకుడు, పార్టీ కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి కూడా మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఉద్యమకారుడిగా పార్టీ బలోపేతానికి, అభ్యర్థుల విజయానికి చాలా కృషి చేశానని తెలిపారు. తనకు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ఎలాంటి అవకాశాలు రాలేదు.. కనీసం ఇప్పుడైనా న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. వారి వినతులన్నీ సావధానంగా విన్న మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్‌తో చర్చించి చెబుతానని చెప్పినట్లు సమాచారం. త్వరలోనే బీఆర్ఎస్ మిగిలిన నాలుగు సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది.

దాసోజు శ్రవణ్‌కు ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. అయితే దానికి సంబంధించిన అంశం గవర్నర్ వద్ద ఇంకా పెండింగ్‌లో ఉన్నది. ఈ విషయంపై చర్చించడానికి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తన ఎమ్మెల్సీ అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఆయన కేటీఆర్‌ను కోరినట్లు తెలుస్తున్నది. ఇటీవలే మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మంత్రిగా రాణించాలని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మంత్రి పట్నంకు మంత్రి కేటీఆర్ సూచించారు.

First Published:  8 Sept 2023 6:57 AM IST
Next Story