కాంగ్రెస్ నాయకులు మా కాలనీలకు రావొద్దు..
రామాయంపేటలో పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని రోహిత్ చెప్పడంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేళ్లుగా జరిగిన అభివృద్ధి ఇదేనంటూ వారు తమ కాలనీని చూపించారు.
తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. ఊళ్లు, మండలాలు మొత్తానికి మొత్తంగా సీఎం కేసీఆర్ కే మా మద్దతు, బీఆర్ఎస్ కే మా ఓటు అంటూ తీర్మానాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానికులే స్వచ్ఛందంగా తమ ప్రాంతాల్లోకి ఇతర పార్టీల నాయకులెవరూ రావొద్దని అంటున్నారు. తాజాగా మెదక్ జిల్లా రామాయంపేట హరిజనకాలనీలో ఇలాంటి ఘటనే జరిగింది. కాంగ్రెస్ నాయకులు మా కాలనీలోకి రావొద్దంటూ స్థానికులు అడ్డుకున్నారు. దీంతో మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్ కి ఏం చేయాలో పాలుపోలేదు. కాలనీ వాసులకు దండం పెడుతూ..అక్కడినుంచి మెల్లగా జారుకున్నారు.
నిన్నటి వరకు మైనంపల్లి ఫ్యామిలీ బీఆర్ఎస్ లోనే ఉంది. ఒక టికెట్ కాదు, రెండు కావాలంటూ గొడవ పెట్టుకుని కాంగ్రెస్ లో చేరి.. బీఆర్ఎస్ ని తిట్టడం మొదలు పెట్టారు తండ్రీకొడుకులు. ఈ పొలిటికల్ డబుల్ గేమ్ ని స్థానికులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రామాయంపేటలో పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని రోహిత్ చెప్పడంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేళ్లుగా జరిగిన అభివృద్ధి ఇదేనంటూ వారు తమ కాలనీని చూపించారు. అసలు కాంగ్రెస్ నాయకులు మా కాలనీలోకి రావొద్దంటే ఎందుకొచ్చారని నిలదీశారు. నిరసన సెగ తగలడంతో రోహిత్ అక్కడినుంచి వెళ్లిపోయారు.
జూనియర్ మైనంపల్లికి షాక్..
మైనంపల్లి హన్మంతరావు పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీలో తన కొడుక్కి మెదక్ టికెట్ ఇప్పించుకున్నారు. టికెట్ సాధించారు కానీ జూనియర్ మైనంపల్లిని ప్రజలు ఆదరించడంలేదు. అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే ప్రజల మద్దతు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రచారంలో భాగంగా రోహిత్ ఎక్కడికి వెళ్లినా స్థానికులు అడ్డుకుంటున్నరు. జై తెలంగాణ, జై పద్మక్క అంటూ నినాదాలు చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ప్రచారంలో రెండు కాలనీల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో ఆయన చేసేదేం లేక మెల్లగా జారుకున్నారు.