Telugu Global
Telangana

మల్కాజ్‌గిరిలో లోకల్‌ VS నాన్‌ లోకల్‌.. పోస్టర్ల కలకలం

సీఎం రేవంత్ రెడ్డి గ‌తంలో ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన స్థానం కావడంతో కాంగ్రెస్‌ ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది.

మల్కాజ్‌గిరిలో లోకల్‌ VS నాన్‌ లోకల్‌.. పోస్టర్ల కలకలం
X

మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలో మూడు పార్టీల మధ్య రసవత్తరంగా పోరు సాగుతోంది. ఇప్పటికే మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో.. ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్‌ సునీతా మహేందర్ రెడ్డిని బరిలో దించగా.. బీజేపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డికి అవకాశమిచ్చింది. మూడు పార్టీలు పోటాపోటీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి గ‌తంలో ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన స్థానం కావడంతో కాంగ్రెస్‌ ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఇక బీజేపీ సైతం ఈసారి మల్కాజ్‌గిరిలో జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రధాని మోడీ ఈ నియోజకవర్గం పరిధిలోరోడ్‌ షో సైతం నిర్వహించారు. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్‌.. సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తోంది.


తాజాగా మల్కాజ్‌గిరిలో లోకల్‌, నాన్ లోకల్ అంశం తెరపైకి వచ్చింది. మల్కాజ్‌గిరిలో ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. మల్కాజ్‌గిరికి హుజురాబాద్ 166 కిలోమీటర్లు, చేవెళ్ల 59 కిలోమీటర్లు అని పోస్టర్లలో రాశారు. ఈటలను కలవాలంటే 166 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజురాబాద్‌కు వెళ్లాలని, ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని కలవాలంటే 59 కిలోమీటర్ల దూరంలోని చేవెళ్లకు వెళ్లాలనేది పోస్టర్ల సారాంశం. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడని.. పక్కా లోకల్‌ అంటూ పోస్టర్లు వెలిశాయి.

First Published:  5 April 2024 7:59 AM IST
Next Story