Telugu Global
Telangana

ఉస్మానియా ఆస్ప‌త్రి నూతన భవనానికి లైన్‌ క్లియర్‌

ఉస్మానియా ఆస్ప‌త్రి నూతన భవన నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

ఉస్మానియా ఆస్ప‌త్రి నూతన భవనానికి లైన్‌ క్లియర్‌
X

తెలంగాణలో గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య పెరిగిన దూరం రోజుకో కొత్త వివాదానికి కారణమవుతోంది. ఉస్మానియా ఆస్ప‌త్రిపై గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉస్మానియా జనరల్ ఆస్ప‌త్రిలో వసతులపై గవర్నర్‌ అసంతృప్తిని వ్యక్తం చేసిన వెంటనే మంత్రి హరీశ్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. గవర్నర్‌ తమిళిసై పేరు ప్రస్తావించకుండానే కొందరు హాఫ్‌ నాలెడ్జ్‌తో మాట్లాడుతుంటారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఈ వెంటనే ఉస్మానియా హాస్పిటల్‌ నూతన భవన నిర్మాణానికి అన్ని పార్టీలను ఒప్పించి, ప్రభుత్వంపై ఉన్న అపవాదును తుడిచే ప్రయత్నం చేశారు.

ఉస్మానియా ఆస్ప‌త్రి నూతన భవన నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు సచివాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, వాణీ దేవి, రహమత్ బేగ్, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, దానం నాగేందర్, గోపీనాథ్, జాఫర్ హుస్సేన్, కౌసర్ మోయినుద్దీన్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి తదితరులు పాల్గొన్నారు. ప్రజల వైద్య అవసరాల కోసం శిథిలావస్థలో ఉన్న పాత భవనాలు తొలగించి, నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు.

ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిశీలించి, అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియచేస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైకోర్టు నుంచి అనుమతి రాగానే నూతన భవన నిర్మాణం చేపడతామన్నారు. ఉస్మానియా ఆస్ప‌త్రి నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. సీఎం కేసీఆర్ 2015లోనే ఉస్మానియా ఆస్ప‌త్రిని సందర్శించి, కొత్త భవన నిర్మాణానికి ఆదేశించినట్లు గుర్తుచేశారు. చారిత్రక కట్టడం పేరుతో ఆ భవనాన్ని కూల్చవద్దని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టే ఇచ్చిందన్నారు. హైకోర్టు ఆదేశాలతో వేసిన ఐఐటీ హైదరాబాద్ నిపుణుల కమిటీ కూడా ఆస్ప‌త్రి అవసరాలకు ఈ భవనం పని చేయదని చెప్పిందని మంత్రి గుర్తుచేశారు. కొత్త భవనం నిర్మాణానికి ప్రజాప్రతినిధులు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించినందున, హైకోర్టు తుది తీర్పు మేరకు కొత్త నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. ప్రజల భవిష్యత్ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నాలుగు టిమ్స్, నిమ్స్ విస్తరణ, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ల నిర్మాణం చేపట్టిందని మంత్రి హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

అంతకు ముందు ఉస్మానియా ఆస్ప‌త్రిని సందర్శించిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రోగులతో మాట్లాడి, వైద్య సేవలపై ఆరా తీశారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్ని పరిశీలించారు. ఉస్మానియాలో సౌకర్యాలు లేవని గవర్నర్ అభిప్రాయపడ్డారు. సౌకర్యాలు లేకున్నా ఉన్నదాంట్లో వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నారన్నారు. ఒకే వార్డులో మూడు నాలుగు విభాగాలున్నాయన్నారు. ఉస్మానియా ఆస్ప‌త్రి భవనం కట్టి వందల ఏళ్లవుతోందని, శిథిలావస్థకు చేరిన భవనం స్థానంలో నూతన బిల్డింగ్ను నిర్మించాలన్నారు.

రోజుకు 2వేల మందికి పైగా ఔట్‌ పేషెంట్లు వచ్చే ఉస్మానియా ఆస్ప‌త్రి భవనం అధ్వాన స్థితిలో ఉందన్నారు గవర్నర్‌ తమిళిసై. పైకప్పు పెచ్చులూడి రోగులపై పడుతున్నాయన్నారు. ఆస్ప‌త్రికి నూతన భవనాన్ని నిర్మించి, రోగులకు తగు వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా.. గవర్నర్‌ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌ రావు ఘాటుగా స్పందించారు. నిమ్స్‌లో రోబోటిక్‌ సర్జికల్‌ సిస్టంను ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌.. గవర్నర్‌పై పరోక్ష విమర్శలు చేశారు. కొందరు హాఫ్‌ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని విమర్శించారు. కొందరికి మంచి కనపడదు, వినపడదు అని, వాళ్లు మంచిని గురించి ఎప్పుడూ మాట్లాడరని ఎద్దేవా చేశారు.

First Published:  4 July 2023 1:20 AM GMT
Next Story