Telugu Global
Telangana

చైనా నుండి హైదరాబాద్‌కు తరలివస్తున్న లైఫ్ సైన్సెస్ సంస్థలు

ఇక్కడికి మారిన చాలా సంస్థలు చైనాకు చెందినవే అయినప్పటికీ, బ్రెజిల్, బెల్జియం నుండి కూడా కొన్ని లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలను జీనోమ్ వ్యాలీకి మార్చాయని జీనోమ్ వ్యాలీ లోని ఒక కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు.

చైనా నుండి హైదరాబాద్‌కు తరలివస్తున్న లైఫ్ సైన్సెస్ సంస్థలు
X

గత మూడు సంవత్సరాలుగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, ముఖ్యంగా చైనా లో ఉన్న కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. చైనాలో కీలకమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పుడు శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీలో యూనిట్లను స్థాపించాయి. రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ సమయంలో అనుమతులు ఇవ్వడం, అందుబాటులోకి తెచ్చిన మౌలిక వసతులు ఆ సంస్థలను హైదరాబాద్ కు వచ్చేట్టు చేస్తున్నాయి.

ఈ ట్రెండ్ కోవిడ్19 సమయంలో ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలలో పుంజుకుంది, అనేక సంస్థల వ్యాపార కార్యకలాపాలలో దాదాపు 20 శాతం నుండి 30 శాతం వరకు చైనా నుండి జీనోమ్ వ్యాలీకి మార్చేశారు అని జీనోమ్ వ్యాలీ లోని ఒక కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు.

ఇక్కడికి మారిన చాలా సంస్థలు చైనాకు చెందినవే అయినప్పటికీ, బ్రెజిల్, బెల్జియం నుండి కూడా కొన్ని లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలను జీనోమ్ వ్యాలీకి మార్చాయని అధికారి తెలిపారు.

"జీనోమ్ వ్యాలీలో ఉన్న సదుపాయాలు, లైఫ్ సైన్సెస్ కు మాత్రమే అంకితమైన క్లస్టర్, కాలుష్యం లేక పోవడం సంస్థలను ఇక్కడికి ఆకర్షిస్తున్నాయి ”అని ఆ అధికారి తెలిపారు.

అనేక కంపెనీలు జీనోమ్ వ్యాలీని ఎంచుకోవడానికి, కొత్త యూనిట్ల ఏర్పాటుకు అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం TS-iPASS - సింగిల్ విండో పాలసీ ప్రధాన కారణం అని మరో సీనియర్ అధికారి తెలిపారు.

“నేను అతిశయోక్తి చేయడం లేదు కానీ 21 రోజుల్లోనే అనుమతులు వస్తున్నాయి. అనుమతులు పొందడానికి గడప గడపకూ పరిగెత్తాల్సిన అవసరం లేదు. చాలా వరకు పని ఆన్‌లైన్‌లో జరుగుతుంది, ”అని ఆయన అన్నారు.

తెలంగాణ ఏర్పడక ముందు పారిశ్రామిక విధానం లేదు, పనులు కాస్త అసంఘటితంగా ఉండేవి. ఇప్పుడు, ప్రతిదీ ప్రొఫెషనల్ గా, సమయానుకూలంగా నిర్వహించబడుతున్నాయి అని అధికారి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం జీనోమ్ వ్యాలీకి ప్రత్యేక విద్యుత్, నీటి సరఫరాను ఏర్పాటు చేసింది. ప్రత్యేక సబ్‌స్టేషన్‌ల ద్వారా 50 మెగావాట్ల నుంచి 60 మెగావాట్ల వరకు, అల్వాల్‌ పంపుహౌస్‌ నుంచి 10 ఎంఎల్‌డీల వరకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఇవి కాకుండా, మార్కెట్ సామర్థ్యం, సరసమైన భూమి ధరలు, కౌలుదారులకు నామమాత్రపు అద్దెలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత, మౌలిక సదుపాయాలు కంపెనీలను జీనోమ్ వ్యాలీ వైపు ఆకర్షిస్తున్న మరికొన్ని అంశాలు.

ఇతర నగరాలతో పోలిస్తే, ఇక్కడ భూముల ధరలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. నామమాత్రపు ధరలకు స్టార్టప్‌లకు కూడా స్థలం దొరుకుతుంది అని అధికారి తెలిపారు.

ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో స్థలానికి భారీ డిమాండ్ ఉంది. ఇప్పటికే, ఫేజ్ I , II కింద 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న భూమి ఇప్పటికే ఫుల్ అయిపోయింది. ఫేజ్ IIIలో అభివృద్ధి చేస్తున్న 600 ఎకరాలలో కూడా ఖాళీ లేదు.

జీనోమ్ వ్యాలీని మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి ఉంది. ఆసక్తికరంగా, తమ కార్యకలాపాలను విస్తరించాలనుకునే ప్రస్తుత కంపెనీల నుండి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అని వెల్త్ అండ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధి చెప్పారు.

First Published:  23 Feb 2023 8:12 AM IST
Next Story