రాబోయే రోజుల్లో పెన్షన్లు మరింతగా పెంచుకుందాం : సీఎం కేసీఆర్
ఒకప్పుడు మీకు పాలన చేతగాదు, తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని మీరు పరిపాలించుకోలేరు అని ఎద్దేవా చేశారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత గొప్ప పాలన అందిస్తున్నామో ప్రజలందరూ గమనిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలో వివిధ రకాల సామాజిక పెన్షన్లు అందుకునే వారి సంఖ్య దాదాపు 50 లక్షలుగా ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం వల్లే ఇంత మందికి పెన్షన్లు ఇచ్చుకుంటున్నాము. గతంలో రూ.200 ఉన్న వికలాంగుల పెన్షన్.. ఈ రోజు నుంచి రూ.4,016కు పెంచి ఇస్తున్నాము. ఇదంతా రాష్ట్ర ఆర్థిక ప్రగతి ద్వారానే సాధ్యమయ్యింది. రాబోయే రోజుల్లో అన్ని రకాల పెన్షన్లు తప్పకుండా పెంచుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లాలో ఎస్పీ, కలెక్టరేట్, బీఆర్ఎస్ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పరిపాలనా భవనాలు చూస్తేనే పాలన ఎంత గొప్పగా ఉంటుందో అర్థం అవుతుంది. ఒకప్పుడు మీకు పాలన చేతగాదు, తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని మీరు పరిపాలించుకోలేరు అని ఎద్దేవా చేశారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత గొప్ప పాలన అందిస్తున్నామో ప్రజలందరూ గమనిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నో ఏళ్ల క్రితమే ఏర్పడిన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ల కంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి పథంలో ముందున్నదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువని.. అనతి కాలంలోనే ఈ ఘనతను సాధించామని సీఎం కేసీఆర్ చెప్పారు.
గతంలో తెలంగాణ ప్రాంతంలో 23 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు 50 లక్షలకు మించాయని కేసీఆర్ చెప్పారు. మెదక్ జిల్లాలోని గణపురం ఆయకట్టు ఎంతో దుస్థితిలో ఉండేది. ఇప్పుడు బాగు చేయడంతో 30 వేల నుంచి 40 వేల ఎకరాల మేరకు ఆయకట్టును పెంచుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ గౌరవం ప్రభుత్వ అధికారులకే దక్కుతుందని కేసీఆర్ అన్నారు. మనం ఈ ప్రగతిని ఇక్కడితో ఆపేయకూడదని... మరింత గొప్ప లక్ష్యాలు సాధించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను రూపొందించిన ఆర్కిటెక్ట్ ఉషారెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు.
పెన్షన్ల పంపిణీ..
రాష్ట్రంలోని దివ్యాంగుల పెన్షన్లను దశాబ్ది ఉత్సవాల సమయంలో రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచారు. ఆ పెంచిన పెన్షన్లను ఈ రోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మెదక్ నూతన కలెక్టరేట్‌లో మహ్మద్ ససీర్ హుస్సేన్, భజన్, దత్తయ్యకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందించారు. అలాగే కొత్తగా బీడీ టేకేదారులకు కూడా పెన్షన్లను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు నుంచి వారికి రూ.2,016 అందిస్తున్నారు. ముచ్చెర్ల నరేందర్ రెడ్డి, సిద్ధి రాములు, పద్మలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు.
కార్యాలయాలు ప్రారంభం..
మెదక్ జిల్లాలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షురాలు, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని అభినందించి.. కుర్చీలో కూర్చోబెట్టారు.
జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎస్పీని కుర్చీలో కూర్చోబెట్టి పుష్ఫగుచ్ఛాన్ని అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అక్కడి నుంచి నూతన కలెక్టరేట్ భవనానికి చేరుకొని.. దాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు ఉన్నారు.
*