ఐదురోజులు భయపెట్టి.. ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
చిరుతను పట్టుకోవడానికి 5 బోన్లు, దాని కదలికలు గమనించడానికి 20 కెమెరాలను ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో సంచరిస్తూ ఐదురోజులుగా జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. అటవీ శాఖ అధికారులు దీన్ని బంధించడానికి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతను పట్టుకోవడానికి 5 బోన్లు, దాని కదలికలు గమనించడానికి 20 కెమెరాలను ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. చిరుతపులి సంచారంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిసర గ్రామాల ప్రజలు.. అది బోనుకు చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మేక మాంసం కోసం వచ్చి చిక్కింది..
చిరుత పూర్తి ఆరోగ్యంగా ఉందని ఎఫ్ఎవో విజయానందరావు తెలిపారు. గురువారం రాత్రి సుమారు 8 గంటలకు బోనులో చిక్కిందని చెప్పారు. మేక మాంసం ఎర వేయడంతో దాని కోసం వచ్చి చిరుత బోనులోకి వచ్చిందన్నారు.
ముందు జూ.. అక్కడి నుంచి టైగర్ రిజర్వుకు
పట్టుబడిన చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూ పార్కులో దీని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అంతా బాగుంటే వెంటనే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.