హైదరాబాద్ లో చిరుత.. ఎల్బీ నగర్ లో పాద ముద్రలు
ఎల్బీనగర్ ప్రాంతంలో చిరుత కదలికలు భయాందోళనలకు కారణం అవుతున్నాయి. ఇంతకీ చిరుత కదలికలు నిజమేనా లేక వట్టి పుకార్లా అనేదానిపై పోలీసులు దృష్టి పెట్టారు. దాని పాదముద్రలు చూసి చిరుత జాడ నిజమేనని తేల్చారు.
ఇటీవల తిరుమలలో చిరుతల అలజడి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. శ్రీవారి భక్తులు భయం భయంగా అలిపిరి మార్గంలో మెట్లు ఎక్కుతున్నారు. ఇప్పుడు చిరుత హైదరాబాద్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది. అందులోనూ ఎల్బీనగర్ ప్రాంతంలో చిరుత కదలికలు అందరిలోనూ భయాందోళనలకు కారణం అవుతున్నాయి. ఇంతకీ చిరుత కదలికలు నిజమేనా లేక వట్టి పుకార్లా అనేదానిపై పోలీసులు దృష్టి పెట్టారు. దాని పాదముద్రలు చూసి చిరుత జాడ నిజమేనని తేల్చారు.
ఎల్బీనగర్ ప్రాంతం వనస్థలిపురంలోని సాగర్ కాంప్లెక్స్ రోడ్ నెం.6లో చిరుత సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి 12:30 గంటలకు చిరుతపులి సంచరించిందని అఖిల్ అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చిరుతకోసం గాలించారు. అది ఏవియేషన్ అకాడమీ గోడ దూకి అడవిలోకి పారిపోయిందని తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకుని చిరుత పాద ముద్రలను సేకరించారు.
ఎల్బీనగర్ ప్రాంతంలో కనపడిన చిరుత ఇబ్రహీంపట్నం అడవుల్లోకి వెళ్లిందని భావిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. చిరుత కదలికలను పసిగట్టేందుకు పలుచోట్ల కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. చిరుత వార్తలతో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రెండుచోట్ల చిరుత కోసం బోనులు ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. హైదరాబాద్ లో చిరుత సంచారం ఇప్పుడు సంచలనంగా మారింది.
♦