Telugu Global
Telangana

గచ్చిబౌలిలో ఒరిగిన భవనం..తప్పిన పెను ప్రమాదం

ఇంటి నిర్మాణానికి గుంతలు తీశాడు.. ఒరిగిన పక్కనున్న ఐదంతస్తుల భవనం. హైడ్రాలిక్‌ యంత్రాలతో కూల్చివేయనున్న అధికారులు

గచ్చిబౌలిలో ఒరిగిన భవనం..తప్పిన పెను ప్రమాదం
X

హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని సిద్ధిఖీనగర్‌లో పెను ప్రమాదం తప్పింది. ఇంటి నిర్మాణం కోసం గుంతలు తీయడంతో పక్కన భవనం పెద్ద ఎత్తున శబ్దాలతో పక్కకు ఒరిగింది. భవనం ఒరుగుతుండగా ప్రజలు ఇండ్లలోంచి పరుగులు తీశారు. స్థానికుల అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది. ఎప్పుడు కూలుతుందోనని స్థానికల్లో భయాందోళనలు నెలకొన్నాయి. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు ఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం భవనం పక్క స్థలం యజమాని గుంతలు తీశాడు. దాని ప్రభావంతో మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆ భవనం ఒక్కసారిగా గుంతలవైపు ఒరిగింది. అందులో సుమారు 30 మంది ప్రాణభయంతో బైటికి పరుగులు తీశారు. ఈ క్రమంలో మూడో అంతస్తులోని ఇక్బాల్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి భయంతో పై నుంచి కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

సరైన ప్రమాణాలు పాటించకుండా పిల్లర్‌పునాదులు తీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో లోతుగా తవ్విన గుంతలను అధికారులు పూడ్చివేశారు. ఒరిగిన భవనం పరిసరాల్లో స్థానికులను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. మరికొద్దిసేపట్లో పక్కకు ఒరిగిన భవనం వద్దకు హైడ్రాలిక్‌ యంత్రాలు చేరుకోనున్నాయి. వాటి సాయంతో ఒరిగిన భవనాన్ని కూల్చివేయనున్నారు.

పరిహారం ఇప్పించండి

పక్కనే ఉన్న నిర్మాణానికి గుంతలు తీయడంతోనే తమ భవనం పక్కకు ఒరిగిందని యజమాని స్వప్న అన్నారు. రెండేళ్ల కిందట ఊరిలో ఉన్న పొలం అమ్మి అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. భవనం కూలిపోతే చుట్టుపక్కల వారికి ఇబ్బంది అని తొలిగించడానికి సిద్ధమౌతున్నామని అయితే పక్క భవనం యజమానితో నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోరారు.లేకపోతే తన పాటు తమ పిల్లలు రోడ్డున పడాల్సి వస్తుందన్నారు.

First Published:  20 Nov 2024 10:01 AM IST
Next Story