Telugu Global
Telangana

బీజేపీకి అసంతృప్తుల సెగ.. నేతల వార్నింగ్‌..!

ఇక ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ పేరు ఫస్ట్‌ లిస్ట్‌లో కనిపించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.

బీజేపీకి అసంతృప్తుల సెగ.. నేతల వార్నింగ్‌..!
X

బీజేపీలో అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్ చిచ్చు రేపింది. టికెట్ దక్కని నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ముథోల్‌ టికెట్ ఆశించిన రమాదేవి నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ అన్యాయం చేసిందని బోరున విలపించారు. ఇక పటాన్‌చెరులోనూ అసమ్మతి బయటపడింది. నందీశ్వర్‌ గౌడ్‌కు టికెట్‌ కేటాయించడంతో స్థానిక నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. 8 మంది మండల, డివిజన్ స్థాయి బీజేపీ అధ్యక్షులు పార్టీ పెద్దలకు అల్టిమేటం జారీ చేశారు. నందీశ్వర్ గౌడ్ అభ్యర్థిత్వంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.

ఇక ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ పేరు ఫస్ట్‌ లిస్ట్‌లో కనిపించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ చీఫ్‌ కిషన్‌ రెడ్డిని కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభాకర్‌. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీగా సేవలందించిన మోహన్ రెడ్డి సైతం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కిషన్ రెడ్డికి పంపారు.


వరంగల్‌ పశ్చిమ టికెట్‌ ఆశించిన రాకేష్‌ రెడ్డికి నిరాశే ఎదురైంది. ఆ స్థానాన్ని రావు పద్మకు కేటాయించింది బీజేపీ అధిష్టానం. దీంతో రాకేష్‌ రెడ్డి, ఆయన అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గోషామహల్‌ టికెట్ ఆశించిన మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్ తనయుడు విక్రమ్‌ గౌడ్ సైతం తీవ్ర నిరాశలో ఉన్నారు. వీరితో పాటు రామగుండం, నర్సాపూర్‌, ఆదిలాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లోనూ ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఆదివారం 52 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

First Published:  23 Oct 2023 2:06 PM IST
Next Story