Telugu Global
Telangana

హైదరాబాద్ కు అతిరథ మహారథులు.. కొత్త పార్టీకి శుభాకాంక్షలు..

ఇప్పటికే జాతీయ స్థాయిలో కేసీఆర్ కి మద్దతు పెరుగుతోంది. వివిధ పార్టీల కీలక నేతలు హైదరాబాద్ కి వచ్చి నేరుగా కేసీఆర్ కి శుభాకాంక్షలు చెప్పబోతున్నారు.

హైదరాబాద్ కు అతిరథ మహారథులు.. కొత్త పార్టీకి శుభాకాంక్షలు..
X

జాతీయ రాజకీయాల్లో ఈరోజు కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించబోతోంది. సరిగ్గా మధ్యాహ్నం 1.19 నిముషాలకు కేసీఆర్ జాతీయ పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటిస్తారు. ఈమేరకు హైదరాబాద్ లో కోలాహలం మొదలైంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కేసీఆర్ కి మద్దతు పెరుగుతోంది. వివిధ పార్టీల కీలక నేతలు హైదరాబాద్ కి వచ్చి నేరుగా కేసీఆర్ కి శుభాకాంక్షలు చెప్పబోతున్నారు.

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. కుమారస్వామి వెంట మాజీ మంత్రి రేవన్న, ఇతర నేతలు ఉన్నారు. జేడీఎస్ ముందునుంచీ టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను బలంగా ఆకాంక్షిస్తోంది. సంకీర్ణ యుగంలో ప్రధానిగా పనిచేసిన దేవెగౌడ.. మరోసారి అలాంటి పరిస్థితులు రావాలని కోరుకుంటున్నారు. ఢిల్లీ గద్దెపై ఏక ఛత్రాధిపత్యం ఉండకూడదని, ప్రాంతీయ పార్టీల హవా పెరగాలని, సంకీర్ణ సర్కారుతోనే మంచిరోజులొస్తాయనేది జేడీఎస్ అభిప్రాయం. అందుకే వారు కేసీఆర్ కి మద్దతుగా నిలిచారు.

తమిళనాడు నుంచి..

కేసీఆర్ పాలన ముఖ్యంగా దళిత, బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. దళితబంధు అనే పథకం దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను ఆకర్షించింది. తమిళనాడులోని దళిత ఉద్యమ పార్టీ 'విడుదలై చిరుత్తయిగల్ కచ్చి' (VCK) కూడా కేసీఆర్ స్ఫూర్తిని కొనియాడుతోంది. ఆ పార్టీ బహిరంగంగా టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు సపోర్ట్ గా నిలుస్తోంది. VCK అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్ కూడా హైదరాబాద్ వచ్చారు. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాలను స్వాగతిస్తూ ప్రకటన విడుదల చేశారు.

సందడే సందడి..

కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానంపై కొన్ని ప్రాంతీయ పార్టీలతో సహా బీజేపీ ఉలిక్కిపడుతోంది. మరికొన్ని పార్టీలు మాత్రం దీన్ని ఓ ముందడుగుగా అభివర్ణిస్తూ స్వాగతం పలుకుతున్నాయి. ఆయా పార్టీల నేతలు ఈరోజు హైదరాబాద్ కి వచ్చి కేసీఆర్ ని కలవబోతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు టీఆర్ఎస్ నాయకలుతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. చేరికలు, విలీనాలు కూడా భారీగా ఉంటాయనే అంచనాలున్నాయి. మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీ ప్రకటన తర్వాత 3 గంటలకు కేసీఆర్ కీలక ప్రసంగం ఉంటుంది.

First Published:  5 Oct 2022 8:08 AM IST
Next Story