ఏ ఒక్కటీ వదలొద్దు.. బుజ్జగింపుల వెనుక బీఆర్ఎస్ వ్యూహం అదే..
పాలేరు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత తుమ్మల ఇంటికి ఎంపీ నామా రాయబారానికి వెళ్లారు.
బీఆర్ఎస్‌లో టికెట్ల కేటాయింపుల తర్వాత బయటికొస్తున్న అసంతృప్తిని చల్లార్చేందుకు పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. కీలక నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ జిల్లా పరిషత్ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డిలను స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ దక్కలేదని ఆవేదన చెందుతున్న రాజయ్య ఇంటికి పంపింది. అదే విధంగా పాలేరు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత తుమ్మల ఇంటికి ఎంపీ నామా రాయబారానికి వెళ్లారు. ఏ ఒక్క సీటునూ వదలొద్దన్న పట్టుదలతోనే బీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగిస్తోంది.
ఇద్దరూ గట్టి నేతలే..
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య 2014 ఎన్నికల్లో 59వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. వరంగల్ లోక్‌సభ స్థానం విజయానికి ఈ మెజారిటీ బాగా ఉపకరించింది. తర్వాత 2018 ఎన్నికల్లోనూ రాజయ్య 36వేల మెజార్టీతో గెలిచారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయనకు పలుకుబడి ఉంది. స్థానిక పరిస్థితుల వల్ల వారికి ఈ ఎన్నికల్లో టికెట్లివ్వలేకపోయామని.. అయితే బలమైన నేతలు కాబట్టి వదులుకోకూడదనే పార్టీ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఏ వర్గానికీ దూరం కావద్దు
అదీకాక రాజయ్య తెలంగాణలోని ఎస్సీల్లో అత్యంత కీలకమైన మాదిగ సామాజికవర్గానికి చెందినవారు. ఎస్సీల్లోనే మరో వర్గానికి చెందిన కడియం శ్రీహరికి చోటిచ్చి రాజయ్యను పక్కనపెట్టారంటే ఆయన సామాజికవర్గంలో పార్టీకి వ్యతిరేకత రాకూడదనే ఆయనకు సర్దిచెప్పేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. అలాగే తుమ్మల సామాజికవర్గమైన కమ్మ వారి ఓట్లు ఖమ్మం జిల్లాలోనే కాదు.. గ్రేటర్ హైదరాబాద్‌లోని చాలా సీట్లలో కీలకం. బంగారు తెలంగాణ సాధన కోసం నడుస్తున్న తమ పార్టీ ఏ వర్గాన్నీ దూరం చేసుకోవాలనుకోవడం లేదని, అందుకే అసంతృప్తులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నామని బీఆర్ఎస్‌లోని మరికొందరు నాయకులు అంటున్నారు.