జీవితాంతం మంచానికే పరిమితమయ్యేంతగా సంఘవికి గాయాలు
క్రూరమైన దాడి కారణంగా గర్భాశయ ప్రాంతానికి సమీపంలో సంఘవి వెన్నెముకకు తీవ్ర గాయమైందని తెలిపారు.
ప్రేమోన్మాది శివకుమార్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సంఘవికి జీవితాంతం మంచానికే పరిమితమయ్యేంత ముప్పు పొంచి ఉందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఆమె ముఖం, వెన్నెముకతో పాటు ఇతర ప్రాంతాల్లో బలమైన గాయాలైనట్టు తెలిపారు. ముఖంపై సర్జరీ చేసి కుట్లు వేసినట్లు వివరించారు. ఆదివారం జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన సంఘవికి గచ్చిబౌలిలోని ఏఐజీలో చికిత్స కొనసాగుతోంది.
సోమవారం ఆమె హెల్త్ బులెటిన్‌ను ఏఐజీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏఐజీ చైర్మన్.. ఒక వీడియో మెసేజ్‌లో ఆమె ఆరోగ్య పరిస్థితిని వివరించారు. క్రూరమైన దాడి కారణంగా గర్భాశయ ప్రాంతానికి సమీపంలో సంఘవి వెన్నెముకకు తీవ్ర గాయమైందని తెలిపారు. ఈ గాయం కారణంగా ఆమె శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యే ముప్పు పొంచి ఉందని చెప్పారు. త్వరలో న్యూరోసర్జన్ల బృందం ఆధ్వర్యంలో ఈ గాయానికి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని, ఆమె ఆరోగ్యాన్ని పూర్తిస్థాయిలో కాపాడటానికి వైద్యులు కృషి చేస్తున్నారని వివరించారు.
ఈ గాయాలు ఆమెను జీవితాంతం వేధించకుండా తగిన చికిత్సలు అందజేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మానవీయ కోణంలో ఆమె చికిత్సకు అయ్యే ఖర్చులు ఏఐజీ భరిస్తుందని చెప్పారు. డిశ్చార్జి అయిన తర్వాత కూడా ఆమెకు అన్ని రకాలుగా సాయం అందిస్తామన్నారు. ఆధునిక సమాజంలో ఇలాంటి నేరాలకు చోటు ఉండకూడదన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాలని నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు.
*