మరో లేఖ.. మరింత కన్ఫ్యూజన్..
రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలనుకుంటే కాంగ్రెస్ టికెట్ ఇవ్వదు, ఇచ్చినా గెలవలేరు కాబట్టి, బీజేపీ టికెట్ పై మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని అనుకోవాల్సిందే.
పార్టీ మారే విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారనేదానికి తాజా లేఖ మరో ఉదాహరణ.. మీడియా మిత్రులకు నమస్కారం అంటూ ఆ లేఖ మొదలుపెట్టిన రాజగోపాల్ రెడ్డి, ఎక్కడా కాంగ్రెస్, బీజేపీ ప్రస్తావన తేలేదు. కేవలం కేసీఆర్ పై తన అక్కసు వెళ్లగక్కారు. తాను పార్టీ మారడానికి, మారాలనుకోడానికి ప్రధాన కారణం కేసీఆర్ అని చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు అసలాయన పార్టీ మారుతున్నట్టు కూడా ఆలేఖలో ప్రస్తావించకపోవడం విశేషం. తాజా లేఖతో తనలో ఉన్న గందరగోళాన్ని మరింతగా బయటపెట్టారు రాజగోపాల్ రెడ్డి.
బీజేపీలో చేరాలనేది రాజగోపాల్ రెడ్డి ఆలోచన, కానీ ఆ మాట నేరుగా చెప్పడంలేదు. 2023 ఎన్నికల్లో బీజేపీయే టీఆర్ఎస్ ని ఎదుర్కోగలదు అని హింట్ ఇచ్చి వదిలేస్తున్నారంతే. కాంగ్రెస్ నుంచి బయటకెళ్లిపోవాలనేది ఆయన ఆలోచన, ఇది కూడా నేరుగా చెప్పడంలేదు. తాను రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మాత్రమే అంటున్నారు. రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలనుకుంటే కాంగ్రెస్ టికెట్ ఇవ్వదు, ఇచ్చినా గెలవలేరు కాబట్టి, బీజేపీ టికెట్ పై మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని అనుకోవాల్సిందే. ఆ ఊహను మాత్రం ప్రజలకే వదిలేశారు.
తన నియోజకవర్గంపై కేసీఆర్ కక్షకట్టారని, అందుకే ప్రాజెక్ట్ లు పూర్తి చేయడంలేదని, ఇటీవల హుజూర్ నగర్ లో కూడా ఉప ఎన్నికలొస్తేనే అక్కడి దళితులందరికీ దళిత బంధు ఇచ్చారని, తన నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక తెచ్చి నిధుల వరద పారిస్తానంటున్నారు. అలా నిధులొచ్చినా, నిధులిచ్చినా జనం టీఆర్ఎస్ కి ఓటేస్తారు కానీ, రాజగోపాల్ రెడ్డిని ఎందుకు ఎన్నుకుంటారు..? ఆ చిన్న లాజిక్ ఆయన ఎందుకు మరచిపోయినట్టు..? హుజూరాబాద్ లో ఈటలకు మంత్రి పదవి తీసేశారు, పార్టీనుంచి బయటకు పంపించారనే సింపతీ వర్కవుట్ అయింది, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఇక సింపతీ ఎక్కడనుంచి వస్తుంది..?
నాలో డైలమా లేదు, వెనకడుగు నా రక్తంలోనే లేదు, నియంత పాలనకు చరమగీతం పాడతా, కురుక్షేత్రానికి సైరన్ మోగిస్తా, కౌరవ సేనను ఎదిరిస్తా, ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకి కృషి చేస్తా.. ఇవీ తాజా లేఖలో రాజగోపాల్ రెడ్డి పేల్చిన కొన్ని పంచ్ డైలాగులు. ఇన్ని డైలాగులు చెప్పి పార్టీ మారుతున్నాననే అసలు డైలాగ్ చెప్పకుండా ఆ ఆప్షన్ మాత్రం తనదగ్గరే ఉంచుకున్నారు రాజగోపాల్ రెడ్డి. అంతా అయిపోయాక ఇక మేధావులతో చర్చ, కళాకారులతో సమీక్ష, ప్రజల ఒప్పుకోలు అంటూ లేఖ రాశారు. మరోసారి తన కన్ఫ్యూజన్ ని బయటపెట్టారు.