కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలో లాస్య నందిత సోదరి..
నాన్న సాయన్నను, చెల్లి లాస్యనందితను ఆదరించినట్లుగానే కంటోన్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు నివేదిత.
కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. బీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. అయితే లాస్య నందిత సోదరి నివేదిత తాను కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీచేస్తానని తెలిపారు. కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు స్పష్టం చేసారు. క్యార్యకర్తలు, కంటోన్మెంట్ ప్రజలు కోరిన తర్వాతే పోటీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు నివేదిత. నాన్న సాయన్నను, చెల్లి లాస్యనందితను ఆదరించినట్లుగానే కంటోన్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. త్వరలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు నివేదిత.
1994లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా కంటోన్మెంట్ స్థానం నుంచి గెలుపొందారు జి.సాయన్న. 1999, 2004 లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2009లో ఓడిపోయినా 2014లో తిరిగి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన మరణం తర్వాత కుమార్తె లాస్యనందిత రాజకీయాల్లోకి వచ్చారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ స్థానం నుంచి గెలుపొందారు. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించగా.. ఆ స్థానంలో ఇప్పుడు ఆమె సోదరి నివేదిత పోటీ చేయాలనుకుంటున్నారు.
సాయన్న కుటుంబంపై కంటోన్మెంట్ వాసులకు అభిమానం ఉంది. అందుకే సాయన్న ఐదుసార్లు, ఆయన కుమార్తె ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు సాయన్న మరో కుమార్తె నివేదిత గెలుపుపై కూడా ఎవరికీ అనుమానాలు లేవు. సింపతీ ఓటింగ్ కూడా ఆమెకు కలసి వచ్చే అవకాశముంది. మరి ఈ ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ సీరియస్ గా తీసుకుంటాయో లేదో చూడాలి.