Telugu Global
Telangana

గత ఏడాది ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ బెంగళూరుకన్నా పైచేయి సాధించింది: కేటీఆర్

నాస్కామ్ ప్రకారం, గతేడాది ఐటీ రంగంలో భారతదేశంలో 4.50 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని, ఇందులో హైదరాబాద్ 1.50 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని, బెంగళూరు 1.46 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని మంత్రి తెలిపారు.

గత ఏడాది ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ బెంగళూరుకన్నా పైచేయి సాధించింది: కేటీఆర్
X

గత ఏడాది ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్‌ ఓడించిందని తెలంగాణ‌ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ కంపెనీలు హైదరాబాద్‌ను దాటి తెలంగాణలోని టైర్ II పట్టణాలు, నగరాల్లో తమ‌ కొత్త యూనిట్లను ఏర్పాటు చేసి కార్యకలాపాలను విస్తరించాలని ఐటీ కంపెనీలను ఆయన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో ఐటీ హబ్‌లను ప్రారంభించింది. వచ్చే నెలలో నిజామాబాద్‌ ఐటీ హబ్ ప్రారంభం కానుంది. రాబోయే నెలల్లో మహబూబ్‌నగర్‌, నల్గొండ ఐటీ హబ్‌లను ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు.

నాస్కామ్ ప్రకారం, గతేడాది ఐటీ రంగంలో భారతదేశంలో 4.50 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని, ఇందులో హైదరాబాద్ 1.50 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని, బెంగళూరు 1.46 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని మంత్రి తెలిపారు.

సోమవారం ఇక్కడ ఐటి పరిశ్రమ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఆఫీస్ స్పేస్ వినియోగంలో కూడా బెంగళూరు కన్నా హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేటీఆర్ తెలిపారు.

"నేను బెంగుళూరును తక్కువ‌ చేయలని లేదా ఆ నగరానికి వ్యతిరేకంగా మాట్లాడాలని అనుకోవడం లేదు కానీ ఇప్పుడే ప్రారంభమైన హైదరాబాద్ అభివృద్ది గురించి చెప్పడం అవసరం " అని కేటీఆర్ అన్నారు.

''వివిధ రంగాలకు, ముఖ్యంగా ఐటీ రంగానికి నాణ్యమైన మానవ వనరుల సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా కృషి చేసింది. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) గత ఎనిమిదేళ్లలో 14,000 మందికి పైగా ఫ్యాకల్టీ సభ్యులతో కలిపి 7 లక్షల మంది యువకులకు శిక్షణ ఇచ్చింది.కేవలం ఐటీ రంగమే కాదు, యువతకు లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో కూడా శిక్షణ ఇచ్చాము'' అని కేటీఆర్ చెప్పారు.

T HUB ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు గురించి మంత్రి వివరిస్తూ, Skyroot సంస్థ తన మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా కక్ష్యలోకి రాకెట్‌ను ప్రవేశపెట్టిందని చెప్పారు.

ఈ విషయంలో ఎలోన్ మస్క్ కంపెనీ కూడా మూడు ప్రయత్నాల్లో విజయం సాధించలేకపోయింది. అని ఆయన అన్నారు.

అదే విధంగా, హైదరాబాద్ కు చెందిన‌ ధృవ కంపెనీ కూడా నానో ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అని ఆయన తెలిపారు.

మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యల గురించి మంత్రి మాట్లాడుతూ, 10 మిలియన్ల కుటుంబాలకు 100 MBPS కనెక్టివిటీని విస్తరించడానికి T-Fiber తీవ్ర కృషి చేస్తున్నదని, ఈ సంవత్సరం తమ టార్గెట్ పూర్తవుతుందని కేటీఆర్ చెప్పారు.

నగరంలో రవాణా, మౌలిక సదుపాయాల పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఆర్‌డిపి కింద 47 ప్రాజెక్టులను రూపొందించిందని, వాటిలో 37 ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పారు.

“ఎనిమిదేళ్లలో ఇంత పెద్ద పనిని పూర్తి చేసిన భారతదేశంలోని మరేదైనా నగరాన్ని నాకు చూపించండి ఇది నా ఛాలెంజ్’’ అన్నారు కేటీఆర్.

''జూన్ నాటికి 100 శాతం మురుగునీటి పారుదలని STPల ద్వారా శుద్ధి చేసిన మొదటి నగరంగా హైదరాబాద్‌ అవతరిస్తుంది. 2050 వరకు నగరంలో తాగునీటి కష్టాలు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా పెట్టుబడులు పెట్టింది'' అని తెలిపారాయన‌.

First Published:  9 Jan 2023 5:32 PM IST
Next Story