లక్ష జన హారతికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని 126 గ్రామాలకు చెందిన 1,16,142 మంది లక్షజనహారతిలో పాల్గొని కాళేశ్వరం జలాలకు హారతి ఇచ్చారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు నిర్వహించిన సాగునీటి దినోత్సవం రికార్డులకెక్కింది. సాగునీటి దినోత్సవంలో కాళేశ్వరం జలాలకు లక్షజన హారతి అనే కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా పరిధిలో కాళేశ్వరం జలాలు ప్రవహించే 68 కిలోమీటర్ల పొడవున లక్షమంది ప్రజలు చేరుకుని జలహారతి ఇచ్చారు. మంత్రి జగదీశ్ రెడ్డి సహా అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా జలహారతి ఇచ్చారు. ఈ జలహారతి, జనహారతిగా రికార్డులకెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి జగదీశ్ రెడ్డి.. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులనుంచి జ్ఞాపికతోపాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని 126 గ్రామాలకు చెందిన 1,16,142 మంది లక్షజనహారతిలో పాల్గొని కాళేశ్వరం జలాలకు హారతి ఇచ్చారు. నాగారం మండలంలోని ఈటూరు నుంచి పెనపహాడ్ మండలం రావిచెరువు వరకు 68 కిలోమీటర్ల పొడవున ఈ కార్యక్రమం కొనసాగింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 65,042మంది మహిళలు, 51,100 మంది పురుషులు జనహారతిలో పాల్గొన్నట్టు ధృవీకరించారు.
మంగళవారం సాయంత్రం నుండి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధుల బృందం పర్యటించింది. లక్షమందితో కాళేశ్వరం జలాలకు లక్ష జన హారతి అనుకున్నప్పటికి కార్యక్రమంలో లక్షా 16 వేల 142 మంది పాల్గొన్నట్లు నిర్దారించింది ఈ బృందం. కార్యక్రమం అనంతరం మొమెంటో, ప్రశంసా పత్రాన్ని మంత్రికి అందజేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.