Telugu Global
Telangana

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి?

వామపక్షాలు కూడా మద్దతు ఇస్తుండటంతో తప్పకుండా ఆయన గెలుస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చాక కూసుకుంట్ల పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి?
X

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. మంగళవారం ప్రగతిభవన్‌లో మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ ఇంచార్జీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కూడా పిలిచారు. ప్రభాకర్ అభ్యర్థిత్వం గురించి సీఎం కేసీఆర్ చర్చించారని.. ఆయనకే ఈసారి కూడా టికెట్ కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. వామపక్షాలు కూడా మద్దతు ఇస్తుండటంతో తప్పకుండా ఆయన గెలుస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చాక కూసుకుంట్ల పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.

మరోవైపు మునుగోడు ఉపఎన్నిక విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. తాము ముందుగా అనుకున్న మేరకు మునుగోడులో ఆదరణ లేదని తెలుసుకుందని.. అందుకే ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించడంలో తాత్సరం చేస్తోందని కేసీఆర్ భేటీలో చెప్పినట్లు సమాచారం. అయితే అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదల చేసి నవంబర్‌లో ఎన్నిక నిర్వహించవచ్చని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఎన్నిక డేట్ రాకపోయినా.. రేపో మాపో ఎన్నిక ఉన్నట్లే అన్న‌ట్టుగా పని చేయాలని కేసీఆర్ సూచించారు. దళిత బంధుపై ప్రతీ ఊరిలో ప్రచారం చేయాలని.. ఈ లోపు ఆ పథకం కింద మునుగోడులో 500 మందికి ఎంపిక చేయాలని మంత్రిని ఆదేశించారు.

ఇక ఇటీవల గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్ కోటాను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రచారం చేయాలని చెప్పారు. త్వరలోనే జీవో కూడా ఇవ్వబోతున్నాం.. గిరిజన బంధు కూడా అమలులోకి రాబోతుంది.. కాబట్టి ఈ విషయాలు గిరిజనుల ఇంటింటికి తిరిగి వివరించాలని కేసీఆర్ చెప్పారు. మునుగోడు నుంచి రోజుకు 1000 మందిని బస్సుల్లో హైదరాబాద్ తీసుకొని వచ్చి ఆత్మగౌరవ భవనాలను చూపించాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు ఏర్పాటు చేయాలని, కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలను కూడా ఉత్సవంలా చేయాలని చెప్పారు.

క్షేత్ర స్థాయిలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని.. ప్రచారంలో వామపక్షాలను కూడా కలుపుకొని పోవాలని కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను ఇంచార్జులుగా నియమించామ‌ని, వాళ్లతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం సాగించాలని కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నికల టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే. బీజేపీతో అసలు పోటీనే లేదని కేసీఆర్ తేల్చి చెప్పేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చండూరులో మరోసారి భారీ సభ నిర్వహిద్దామ‌ని.. అందుకు తగిన ఏర్పాట్లు చేయమని కూడా కేసీఆర్ సూచించారు.

First Published:  21 Sept 2022 8:47 AM IST
Next Story