Telugu Global
Telangana

కురియన్ కమిటీకి బురిడీ.. కాంగ్రెస్ నేతల కాశీమజిలీ కథలు

లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం తూతూ మంత్రంగా ముగిసిందని చెప్పాలి.

కురియన్ కమిటీకి బురిడీ.. కాంగ్రెస్ నేతల కాశీమజిలీ కథలు
X

2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు 64. లోక్ సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లు కాంగ్రెస్ కి వస్తాయని అంచనా వేశారు నేతలు. లోక్ సభ ఎన్నికల లోపు కొత్త ప్రభుత్వం మరిన్ని మంచి పనులు చేసి ఉంటే, మరింత మంచి పేరు తెచ్చుకుని ఉంటే 12 లోక్ సభ సీట్లు సునాయాసంగా గెలవాల్సిన సందర్భం. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ 8 సీట్లకు పరిమితం అయింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో 7 సీట్లు గెల్చుకున్న బీజేపీ, లోక్ సభ ఎన్నికల్లో 8 సీట్లకు ఎగబాకింది. కాంగ్రెస్ కి 8 సీట్లు రావడాన్ని పక్కనపెడితే.. బీజేపీకి 8 సీట్లు ఎందుకు వెళ్లాయంటూ అధిష్టానం గుర్రుగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యంపై అధిష్టానం కురియన్ కమిటీ వేసింది. ఈ కురియన్ కమిటీ ముందు కాంగ్రెస్ నేతలు వల్లించిన పాఠం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మా తప్పేం లేదు, అంతా బీఆర్ఎస్ చేసింది..

కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో బీజేపీ పర్ఫామెన్స్ మెరుగవడం, అది కూడా నెలల వ్యవధిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ఇలాంటి ఫలితాలు రావడం అధిష్టానానికి మింగుడు పడలేదు. అయితే కురియన్ కమిటీ కళ్లకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గంతలు కట్టాలని చూసినట్టు స్పష్టమవుతోంది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, అందుకే బీజేపీకి సీట్లు పెరిగాయని కాంగ్రెస్ నేతలు ముక్తకంఠంతో కురియన్ కమిటీకి చెప్పినట్టు తెలుస్తోంది. పోలింగ్ చివరి దశలో బీఆర్ఎస్ ఏజెంట్లు బయటకు వెళ్లిపోయారని, పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చారనేది కాంగ్రెస్ నేతల వివరణ. ఈ వివరణతో కురియన్ కమిటీ సంతృప్తి చెందలేదు. తమ ముందు నేరుగా అభిప్రాయాలు వ్యక్తం చేయలేకపోయిననా.. ఫోన్ ద్వారా అసలు వివరాలు చెప్పాలంటూ కమిటీ సభ్యులు ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు.

ఎన్నికల ఫలితాలు తేడాగా వచ్చిన వేళ.. అధిష్టానానికి చాలా ఫిర్యాదులు వెళ్లాయి. అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదని, ఇతర పార్టీలకు చెందిన నేతలను ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చుకొని బరిలోకి దించారని, కొన్నిచోట్ల బీజేపీ లాభపడేలా అభ్యర్థుల ఎంపిక జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా అందాయి. వీహెచ్ లాంటి సీనియర్లు బహిరంగంగానే తమ అసంతృప్తి బయటపెట్టారు. దీంతో అధిష్టానం కమిటీ వేసి విచారణ చేపట్టింది. అయితే కమిటీ హైదరాబాద్ కి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఏ ఒక్కరూ అసలు విషయాలు చెప్పలేదు, తప్పంతా బీఆర్ఎస్ దేనని అన్నారు. ఆ పార్టీ సహకారం వల్ల బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని వివరణ ఇచ్చారు. కురియన్ కమిటీ ఈ వివరణతో సంతృప్తి చెందకపోయినా, సొంత పార్టీ నేతల మాటల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం తూతూ మంత్రంగా ముగిసిందని చెప్పాలి.

First Published:  13 July 2024 2:52 PM IST
Next Story