Telugu Global
Telangana

కుమారి ఆంటీ హోటల్ క్లోజ్.. తప్పెవరిది..?

మీడియా వాళ్లు మా దగ్గరకు రావొద్దు బాబూ అంటూ వాళ్లు మొత్తుకుంటున్నారు. మా వళ్లే కదా మీరు ఇంత ఫేమస్ అయ్యారు అనేది ఇటువైపు నుంచి వినపడుతున్న సమాధానం.

కుమారి ఆంటీ హోటల్ క్లోజ్.. తప్పెవరిది..?
X

సోషల్ మీడియా సంచలనంగా మారిన కుమారి ఆంటీ హోటల్ ఇప్పుడు మూతపడింది. రోడ్ సైడ్ హోటల్ నడుపుతూ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఆమె.. ఇప్పుడు అదే సోషల్ మీడియా పుణ్యమా అని ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ రాజకీయ కారణాలు కూడా ఉన్నాయంటూ గొడవ మొదలైంది. కుమారి ఆంటీ ఓ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వల్లే తనకు ఇల్లు వచ్చిందని చెప్పడంతో.. తెలంగాణలో చంద్రబాబు అనుకూల కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె హోటల్ మూసివేయించిందనే విమర్శలు వినపడుతున్నాయి. అయితే అసలు నిజమేంటి..? కుమారి ఆంటీ హోటల్ మూతపడటానికి మూల కారణం ఎవరు..?


సోషల్ మీడియాలో సడన్ గా కొందరు సెలబ్రిటీలుగా మారతారు. అయితే ఆ సెలబ్రిటీ స్టేటస్ ని నిలబెట్టుకోవడం, దాని ద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. కుమారి ఆంటీ విషయంలో కూడా అదే రుజువైంది. సెలబ్రిటీ స్టేటస్ తో ఆమె హోటల్ రద్దీగా మారింది. దాదాపు బిజినెస్ రెట్టింపైంది. అంతలోనే ఊహించని పాపులార్టీ ఆమెకు ఇబ్బందిగా మారింది. తినడానికి హోటల్ వద్దకు వచ్చేవారికంటే, ఆమె ఇంటర్వ్యూలకోసం వచ్చే మీడియా హడావిడి పెరిగింది. యూట్యూబర్లు, ఇతర సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఆమెకోసం హోటల్ వద్దకు వస్తుండే సరికి రద్దీ పెరిగింది. ఎంతలా అంటే రోడ్డుమీద ట్రాఫిక్ కూడా ఆగిపోయేలా. దీంతో ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పి మైదలైంది. తాత్కాలికంగా అక్కడినుంచి హోటల్ ఖాళీ చేయాలని, ట్రాఫిక్ కి అంతరాయం లేని మరోచోట పెట్టుకోవాలని సూచించారు.

మీడియా వాళ్లు మా దగ్గరకు రావొద్దు బాబూ అంటూ వాళ్లు మొత్తుకుంటున్నారు. మా వళ్లే కదా మీరు ఇంత ఫేమస్ అయ్యారు అనేది ఇటువైపు నుంచి వినపడుతున్న సమాధానం. మీడియా, సోషల్ మీడియా వల్ల వారు ఫేమస్ అయ్యారు సరే, కనీసం ఇప్పుడు హోటల్ కూడా నడవలేని పరిస్థితి కూడా అదే సోషల్ మీడియా వల్లే వచ్చింది. అంతకు ముందు హోటల్ బ్రహ్మాండంగా సాగకపోయినా వారికి ఇబ్బంది లేకుండా రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఒకేసారి ఇంత హైప్ వచ్చేసరికి ఏకంగా హోటల్ మూతపడింది. రేపు ఆమె ఓ మంచి ప్లేస్ రెంట్ కి తీసుకుని పెద్ద ఎత్తున హోటల్ పెడితే ఇదే హైప్ ఉంటుందని అనుకోలేం.

టీడీపీ వర్సెస్ వైసీపీ వర్సెస్ జనసేన..

జగన్ గురించి నాలుగు మంచిమాటలు చెప్పిన మరుసటి రోజే కుమారి ఆంటీ హోటల్ మూతపడటం మరో విశేషం. దీంతో ఇదంతా చంద్రబాబు చేయించిందేననే వాదన కూడా వినపడుతోంది. జగన్ గురించి గొప్పలు చెబితే ప్రచారం చేసుకున్న వైసీపీ సోషల్ మీడియా.. ఇప్పుడు కుమారి ఆంటీ హోటల్ మూతపడినా కూడా రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడుతున్నారు జనసైనికులు. వారికి జాలి ఉంటే కుమారి ఆంటీని ఆదుకోవాలని సూచిస్తున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారంలో నష్టపోయింది మాత్రం కుమారి ఆంటీనే.

First Published:  31 Jan 2024 3:40 AM GMT
Next Story