కెటిఆర్ తో కుమారస్వామి భేటీ
జనతాదళ్ ఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో మంత్రి కేటీర్ ఈ రోజు సమావేశమయ్యి దేశ రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. అనంతరం కుమారస్వామి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నారు.
జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయ కూటమికి ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ఆయన పలువురు జాతీయ నాయకులు, ముఖ్యమంత్రులను కలుసుకుని దేశ రాజకీయాలపై చర్చించారు. తాజాగా ఆదివారంనాడు జెడిఎస్ నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశం కానున్నారు. కుమారస్వామి ఈ ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కె.టిఆర్ తో సమావేశమయ్యారు. ఈ ఇరువురు నాయకులు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు రాజేందర్, జీవన్ రెడ్డి ఉన్నారు.
అనంతరం కుమారస్వామి తమ భేటీపై ట్వీట్ చేశారు. కెటిఆర్ తో అర్ధవంతమైన చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సమస్యలతో పాటు జాతీయ రాజకీయాలపై చర్చించామన్నారు. దేశంలోజరుగుతున్న వివక్షా,కక్షపూరిత రాజకీయాలకు ముగింపు పలికేందుకు విపక్షాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మద్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ తో కుమారస్వామి బేటీ కానున్నారు.
ఇప్పటికే కెసిఆర్ ప్రతిపక్షాలను ఏకం చేసే కృషిలో భాగంగా మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత దేవెగౌడతో సమావేశమై చర్చించారు. తాజాగా జరుగుతున్నమలివిడత ప్రయత్నాల్లో నేడు కుమారస్వామితో చర్చించనున్నారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలన్నీ మరింత బలపడేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా అడుగులువేస్తున్నారు. ఇప్పటికే ఆయన రైతు ప్రాధాన్యం అజెండాగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ రైతు నాయకులను ఇక్కడికి రప్పించి రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. రైతు బంధు, ఉచిత విద్యుత్, నిరంతర జలవనరులు, నిరుపేద వృద్ధ రైతులకు పెన్షన్ వంటి తదితర పథకాలను వివరించారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వ్తే ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేయాలన్నది కెసిఆర్ లక్ష్యం. ఈ కార్యక్రమాలు చూసి రైతు నాయకులు ముగ్ధులై జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాల్సిందిగా ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే.